Social Media: సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌

Social Media: సోషల్‌ మీడియాలో ఆదరణ కోసం కొంత మంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా రష్యాలో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన పనికి సొంత బిడ్డే బలయ్యాడు.

Updated : 17 Apr 2024 13:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిపోదామన్న ఆతృతతో కొంత మంది చేస్తున్న పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇతరుల ప్రాణాల మీదకూ తెస్తున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఏమాత్రం అవగాహనలేని విషయాలపై సాధికారికంగా మాట్లాడుతూ ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువై పోతోంది. ఇలాగే రష్యాకు చెందిన ఓ ఇన్‌ప్లుయెన్సర్‌ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి.. ఆ పసిబిడ్డ మరణానికి కారకుడయ్యాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది. తాజాగా నేరం రుజువు కావటంతో అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

ప్రత్యేక డైట్‌ ప్రమోషన్‌..

రష్యాకు చెందిన మాక్సిమ్‌ లైయుటీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్‌ల గురించి చెబుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలో తాను ఆహారం, ఆరోగ్యం గురించి ఇచ్చే సూచనలు ఎంత బలమైనవో నిరూపించాలనుకొన్నాడు. సొంత కొడుకుపైనే ప్రయోగాలు మొదలుపెట్టాడు. మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని.. కేవలం సూర్యరశ్మితోనే ఎంతకాలమైనా జీవించొచ్చనేది అతడి భ్రమ. దీన్ని యూజర్లకు నూరిపోసి.. దానిని నిరూపించటం కోసం నెలలు నిండని తన కొడుకుపై ప్రయోగం ప్రారంభించాడు.

భార్య ఎంత వారించినా మాక్సిమ్‌ మాట వినలేదు. ఆ శిశువుకు పాలు పట్టొద్దని హెచ్చరించేవాడు. ఆరోగ్యం క్షీణిస్తున్నా.. రోగనిరోధక శక్తి దానంతట అదే పెరిగి కోలుకుంటాడని మొండిగా వాదించేవాడు. తల్లి ఆగలేక దొంగచాటుగా ఒక్కోసారి ఆ శిశువుకు పాలు పట్టేది. కానీ, మాక్సిమ్‌కు దొరికిపోతానేమోనని ఆమె చాలా భయపడేది.

చేదాటిపోయాక ఆసుపత్రికి..

శిశువును ఎండలో మాత్రమే ఉంచాలని.. అప్పుడే కోలుకుంటాడని మూర్ఖంగా వాదించేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇబ్బంది పడుతున్నా వైద్యుల వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతించేవాడు కాదని వారు వాపోయారు. పైగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారిని చన్నీటిలో ముంచేవాడని చెప్పారు. దాని వల్ల అతడి శరీరం దృఢంగా తయారవుతుందనేవాడని ఆ చిన్నారి దయనీయ పరిస్థితిని వివరించారు.

క్రమంగా బాలుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు పలువురి ఒత్తిడి మేరకు బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మాక్సిమ్‌ అనుమతించాడు. కానీ, అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వైద్య పరీక్షల్లో నిమోనియా సహా పలు సమస్యల వల్ల ఆ చిన్నారి చనిపోయినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు మాక్సిమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బిడ్డ బలం కోసమేనట..

గర్భవతిగా ఉన్నప్పుడు తన భార్య పౌష్టికాహారం తీసుకోలేదని అందుకే బిడ్డ అనారోగ్య సమస్యలతో మరణించాడని విచారణలో మాక్సిమ్‌ బుకాయించాడు. తల్లి మాత్రం ఉన్న విషయం చెప్పేసింది. ఆమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది విచారణ తర్వాత మాక్సిమ్‌ కూడా నేరాన్ని అంగీకరించాడు. తన వల్లే కుమారుడు మరణించాడని ఒప్పుకొన్నాడు. అయితే, తాను కావాలని అలా చేయలేదని.. బిడ్డను బలమైన వ్యక్తిగా చూడాలన్నదే తన లక్ష్యమని న్యాయస్థానానికి తెలిపాడు. అతడిని దోషిగా తేల్చిన కోర్టు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కొసమెరుపు ఏంటంటే.. పచ్చి కూరగాయలు తినాలని సూచించిన అతడే.. కస్టడీలో ఉన్నప్పుడు నూడుల్స్‌, మాంసం వంటివి ఆర్డరు చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని