Russia: రష్యా ఘోర తప్పిదం.. సొంత నగరంపైనే బాంబు..!

ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) ఏడాది నుంచి యుద్ధం కొనసాగిస్తున్న రష్యా (Russia).. సొంత నగరంపైనే దాడి చేసుకొంది. అయితే, అది పొరపాటున జరిగినట్లు అక్కడి రక్షణశాఖ వెల్లడించింది.

Published : 21 Apr 2023 13:57 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా (Russia).. తాజాగా సొంత నగరంపైనే బాంబు దాడి చేసింది. నాలుగు లక్షల జనాభా ఉన్న పట్టణంపై తన యుద్ధ విమానం నుంచి ఓ ఆయుధాన్ని జారవిడిచింది. పేలుడు ధాటికి నగరంలో ఓ కూడలి వద్ద దాదాపు 40 మీటర్ల వ్యాసంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. సమీపంలోని భవనాలు ధ్వంసం కావడంతోపాటు వాహనాలూ ఎగిరిపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

రష్యాలోని బెల్గొరాడ్‌ నగరం ఉక్రెయిన్‌కు సరిహద్దులో (సుమారు 40కి.మీ దూరంలో) ఉంటుంది. గురువారం రాత్రి రష్యాకు చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం ఈ నగరంపై ప్రయాణించింది. అదే సమయంలో యుద్ధ విమానం నుంచి ప్రమాదవశాత్తు ఓ బాంబు జారిపడింది. అది పడిన ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి ఓ కారు ఎగిరి సమీప ఇంటిపైకప్పు మీద పడినట్లు రష్యా వార్తాసంస్థ ఆర్‌ఐఏ వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన బెల్గొరాడ్‌ మేయర్‌ వాలెంటిన్‌ దెమిదోవ్‌.. ఈ పేలుడు కారణంగా అనేక భవనాలు దెబ్బతినడంతోపాటు ఇద్దరు స్థానికులకు గాయాలైనట్లు వెల్లడించారు.

మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ.. కొత్తగా సుఖోయ్‌-34 యుద్ధ విమానాలను రష్యా సైన్యానికి అందించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అవి ఎన్ని ఇచ్చారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. విభిన్న ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది. అయితే, తాజా ఘటనలో ఏ రకమైన ఆయుధం ఈ ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని రష్యా రక్షణశాఖ వెల్లడించలేదు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న బెల్గొరాడ్‌ నగరంలో రష్యా ఆయుధ కేంద్రం ఉంది. ఈ నగరంపై ఉక్రెయిన్‌ బలగాలు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా పలుమార్లు ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు