Ukraine Crisis: మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. క్షిపణుల దాడిలో 16 మంది మృతి!

ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మళ్లీ దాడులకు దిగాయి. 20కిపైగా క్షిపణులు, రెండు డ్రోన్లను ప్రయోగించాయి. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందారు.

Published : 28 Apr 2023 19:17 IST

కీవ్: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్‌ (Kyiv)సహా ఆయా నగరాలపై 20కిపైగా క్షిపణులు, రెండు డ్రోన్లను ప్రయోగించింది. ఆయా దాడుల్లో మొత్తం 16 మంది మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. మార్చి 9వ తేదీ తర్వాత కీవ్‌పై మాస్కో బలగాలు క్షిపణి దాడులు (Missile Attack) చేపట్టడం ఇదే మొదటిసారి. మరోవైపు.. కీవ్‌ గగనతలంలో ఉక్రెయిన్‌ వాయుసేన మొత్తం 11 క్షిపణులు, రెండు యూఏవీలను నేలకూల్చినట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది. రష్యా సైనిక చర్య విషయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)తో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) మాట్లాడటం, ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున యుద్ధ సామగ్రి అందించినట్లు నాటో (NATO) వెల్లడించిన వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.

రష్యా తాజా దాడుల్లో ఉమాన్‌ నగరంలోని ఓ తొమ్మిది అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పదేళ్ల చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 17 మంది గాయపడ్డారని తెలిపారు. నీపర్‌లో జరిగిన మరో దాడిలో 31 ఏళ్ల మహిళ, ఆమె రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక గవర్నర్‌ చెప్పారు. కీవ్‌లో కూల్చివేసిన క్షిపణి, డ్రోన్‌ల శకలాలు పడి విద్యుత్ లైన్‌లు, రహదారులు దెబ్బతిన్నాయి. ఉద్దేశపూర్వక బెదిరింపు వ్యూహంలో భాగంగానే క్రెమ్లిన్‌ ఈ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. శాంతి ఒప్పందంపై రష్యా ఆసక్తి చూపడం లేదనే దానికి తాజా ఘటనలే నిదర్శనమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలను తరిమేయడమే శాంతికి మార్గమని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని