Ukraine-Russia: క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. ఏడుగురు ఉక్రెయిన్‌ పౌరులు మృతి

బఫర్‌జోన్‌ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉద్ధృతం చేసింది. క్షిపణులతో గురువారం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఏడుగురు ఉక్రెయిన్‌ పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు.

Published : 23 May 2024 21:37 IST

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పై రష్యా దాడులను ఉద్ధృతం చేస్తోంది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 16 మందికి తీవ్ర గాయాలైనట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యాది అతి కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని యుద్ధం చేస్తున్నట్లు గుర్తు చేసిన ఆయన.. పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని నిరాశ వ్యక్తంచేశారు. రష్యా వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినన్ని రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదన్నారు.

రష్యా సరిహద్దు నుంచి ఖర్కీవ్‌ నగరం కేవలం 20 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకొని బఫర్‌ జోన్‌ ఏర్పాటుచేయాలనేది మాస్కో లక్ష్యం. ఈ క్రమంలోనే క్షిపణులతో దాడి చేసి అక్కడి ఆస్తులను ధ్వంసం చేస్తోంది. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవడంలో ఉక్రెయిన్‌ వెనకబడింది. పాశ్చాత్య దేశాల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఇదే అదునుగా భావించిన రష్యా దాడులను ఉద్దృతం చేస్తోంది. ఉక్రెయిన్‌ పవర్‌ గ్రిడ్‌తోపాటు, జనసంచార ప్రదేశాల్లో క్షిపణులతో విరుచుకుపడుతోంది.

మరోవైపు తమ దేశానికి చెందిన బెల్గార్డ్‌ రీజియన్‌లో ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడినట్లు రష్యా ఆరోపిస్తోంది. గురువారం తమ దేశంపై దాడి చేసేందుకు ప్రయోగించిన 35 రాకెట్లు, 3 డ్రోన్‌లను నేల కూల్చినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇంటిపై ఓ డ్రోన్‌ కూలిపోయి, మహిళ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని