అంతర్జాతీయ వేదికపై గిల్లికజ్జాలు.. రష్యా ప్రతినిధితో ఉక్రెయిన్‌ ఎంపీ గొడవ

ఉక్రెయిన్‌(Ukraine), రష్యా(Russia) మధ్య రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో కూడా ఆ తరహాలోనిదే. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 05 May 2023 10:51 IST

అంకారా: తమ స్థాయి, స్థానం మరిచి రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ ఆయనపై దాడికి దిగారు. ఈ ఘర్షణ టర్కీ(Turkey) రాజధాని అంకారా(Ankara)లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

గత 14 నెలలుగా ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది (Ukraine Crisis). ఈ సమయంలో మొదటిసారి అంకారాలో ‘బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ’ 61వ సమావేశం జరుగుతోంది. ఈ వేదికగా ఉక్రెయిన్‌ ఎంపీ ఒకరు తన దేశ జెండాను ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సమయంలో రష్యా ప్రతినిధి ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ జెండాను లాక్కొని దూరంగా వెళ్లబోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ.. ఆ రష్యా వ్యక్తిపై వేగంగా దూసుకెళ్లి, దాడి చేశారు. ఆ తర్వాత తన జెండాను వెనక్కి తీసుకున్నారు. ఈ ఆకస్మిక చర్యతో అక్కడున్నవారు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఆ తర్వాత ఇద్దరిని విడదీశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌చేసింది.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ముగింపు ఛాయలు కనిపించకపోగా.. రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రంగా మండిపడుతోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపడం మినహా మరో మార్గం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ ఈ దాడికి తాము కారణం కాదని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత వీడియో వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 30 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. దీనిలో ఉక్రెయిన్‌, రష్యా సభ్యదేశాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని