Moscow: మాస్కో మారణహోమంలో ఉక్రెయిన్‌ మిలటరీ!

మాస్కోలోని అతిపెద్ద సంగీత కచేరీ హాలులో ఇటీవల జరిగిన మారణహోమంలో ఉక్రెయిన్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు నేరుగా పాల్గొన్నారని రష్యా ఎఫ్‌ఎస్‌బీ అధిపతి అలెగ్జాండర్‌ బోర్టినికోవ్‌ ఆరోపించారు.

Published : 24 May 2024 16:01 IST

మాస్కో: రష్యా (Russia) రాజధాని మాస్కో(Moscow)లోని అతిపెద్ద సంగీత కచేరీ హాలులో ఇటీవల జరిగిన మారణకాండతో ఉక్రెయిన్‌కు సంబంధమున్నట్లు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) అధిపతి అలెగ్జాండర్‌ బోర్టినికోవ్‌ (Alexander Bortnikov) ఆరోపించారు. ఈ మారణహోమంలో ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు నేరుగా పాల్గొన్నట్లు ఆయన ఆక్షేపించారు. ఈమేరకు రష్యా వార్తా సంస్థ ‘టాస్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. మార్చి 22న దాదాపు 6 వేల మంది సామర్థ్యమున్న క్రాకస్‌ సిటీ హాలులో సంగీత కచేరీ జరుగుతుండగా దుండగులు రెచ్చిపోయి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 140 మందికిపైగా మరణించారు. ఇందుకు సంబంధించి రష్యా భద్రతా సిబ్బంది 11 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో నేరుగా నలుగురు తజకిస్థాన్‌ జాతీయులూ పాల్గొన్నారు.

టాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల ఘటనపై ఓవైపు రష్యా దర్యాప్తును కొనసాగిస్తున్నప్పటికీ.. ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చింది. దాడి వెనక ఉక్రెయిన్ హస్తం ఉందని బలంగా నమ్ముతున్నామని బోర్టినికోవ్‌ తెలిపారు. మరోవైపు రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు అఫ్గానిస్థాన్‌తోపాటు మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాలు ఉక్రెయిన్‌కు కిరాయి సైనికులను సమకూరుస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. అయితే, ఈ ఘటనతో తమకేమీ సంబంధం లేదని ఇప్పటికే ఉక్రెయిన్‌ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికే ప్రకటించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని