Nuclear War: ఆ చర్యలతో ‘అణు యుద్ధం’ ముప్పు.. పశ్చిమ దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్న రష్యా అధినేత పుతిన్‌.. తమ దేశ భద్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటున్నట్లు చెప్పారు.

Updated : 29 Feb 2024 21:21 IST

మాస్కో: ఉక్రెయిన్‌ (Ukraine)లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) మరోసారి స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలు.. ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండిఉన్నాయని పశ్చిమ దేశాలను హెచ్చరించారు. వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికల వేళ.. ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మాస్కో తన భద్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటోందని, ఉక్రెయిన్‌లోని తమ వారిని కాపాడుతోందన్నారు. కీవ్‌లో నిస్సైనికీకరణ జరిగేలా చూసి, ‘నాటో’లో చేరకుండా చేయడం తన లక్ష్యమని పుతిన్‌ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

‘‘పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు బలగాలను తరలించాలనుకోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. వారి భూభాగాల్లోని లక్ష్యాలనూ ఛేదించగల ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. ఆ దేశాల నాయకులు ఇప్పటివరకు ఎటువంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కోలేదు. యుద్ధం అంటే ఏంటో వారు మర్చిపోయారు’’ అని పుతిన్‌ విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో ఉక్రెయిన్‌లో పాశ్చాత్య బలగాల మోహరింపు అంశాన్ని కొట్టిపారేయలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పుతిన్‌ ఈమేరకు స్పందించినట్లు తెలుస్తోంది. ఐరోపాలోని ‘నాటో’ దేశాలకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొన్నారు.

అంతరిక్షంలోకి అణ్వాయుధాలు..మేం వ్యతిరేకం: పుతిన్‌

అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసకర ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు అగ్రరాజ్యం చేసిన ఆరోపణలను పుతిన్‌ మరోసారి తోసిపుచ్చారు. ‘‘యుద్ధంలో మా ఓటమి కోసం వాషింగ్టన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తన నిబంధనల మేరకు రూపొందించిన ‘అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం’పై మాస్కోను చర్చలకు రప్పించే కుట్రలో భాగమే ఇదంతా’’ అని మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల వేళ.. ప్రపంచాన్ని తాము పాలిస్తున్నామని చాటిచెప్పేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని, కానీ అది పని చేయదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని