Shehbaz Sharif: సౌదీ యువరాజుతో పాక్‌ ప్రధాని భేటీ.. ‘కశ్మీర్‌’ అంశంపై చర్చ

రెండోసారి పాక్‌ ప్రధాని పదవి చేపట్టిన షెహబాజ్‌ షరీఫ్.. సౌదీ యువరాజ్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా జమ్ముకశ్మీర్‌ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

Published : 08 Apr 2024 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan) ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) రెండోసారి పదవి చేపట్టిన అనంతరం తొలిసారి విదేశీ పర్యటన చేపట్టారు. సౌదీ అరేబియాకు వెళ్లిన ఆయన యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (Mohammed bin Salman)తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ‘కశ్మీర్‌’ అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో అభివృద్ధిపై ఉన్న అవకాశాలను సమీక్షించారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌ అంశంపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరుదేశాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. భారత్‌- పాకిస్థాన్‌ నడుమ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించినట్లు తెలిపాయి. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌ వివాదాన్ని ప్రస్తావించారట. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనడానికి రెండు దేశాలు జరపాల్సిన చర్చల అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం.

ఉగ్రవాదులను వదలబోమంటూ భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరికలపై పాకిస్థాన్‌ స్పందించింది. దానిని ఖండిస్తున్నట్లు పేర్కొన్న పాక్‌.. భారత్‌తో ఉన్న వివాదాల పరిష్కారానికి చర్చలు అవసరమని తెలిపింది. కాగా ఈ సమావేశంలో సౌదీ ప్రధానితో చర్చించిన అంశాలను పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని