Moscow: మాస్కోలో దుండగుల కాల్పులు.. 133 మంది మృతి

రష్యా రాజధాని మాస్కోలో ఓ కన్సర్ట్‌ హాలులో దుండగులు కాల్పులు జరిపారు.

Updated : 24 Mar 2024 01:05 IST

మాస్కో: రష్యా (Russia) రాజధాని మాస్కో (Moscow)లో భారీ ఉగ్రదాడి చోటుచేసుకుంది. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 133 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. 

తొలుత భవనంలోనికి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. సంగీత కార్యక్రమం అయిపోవడంతో బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్‌లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. 

ఈ దాడికి సంబంధించి సోషల్‌ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. సాయుధులు కాల్పులు జరపడం, పలువురు భయాందోళనలతో ఘటనాస్థలం నుంచి పారిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ దాడితో భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. ఐదుగురు సాయుధులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది.  

హాల్‌లోకి ప్రవేశించిన సాయుధులు బాంబులు సైతం విసిరినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో భవనమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై అమెరికా వైట్‌హౌజ్‌ స్పందించింది. ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆదేశ జాతీయ భద్రత సలహాదారు జాన్‌ కిర్బీ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని తెలిపారు. 

గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. 2002లో చెచెన్‌ మిలిటెంట్లు మాస్కో థియేటర్‌లో సుమారు 800 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో రష్యాన్‌ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి వారిని విడిపించాయి. ఈ క్రమంలో 129 మంది బందీలు, 41 మంది మిలిటెంట్లు చనిపోయారు. ఇక 2004లో 30 మంది చెచెన్‌ సాయుధులు బెస్లాన్‌లోని ఓ పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని వందల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించే క్రమంలో సుమారు 330 మంది చనిపోయారు. వారిలో సగం వరకు చిన్నారులే ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని