Canada: నిజ్జర్‌ స్నేహితుడి ఇంటిపై కాల్పులు.. దర్యాప్తు చేపట్టామన్న కెనడా

కెనడాలో నిజ్జర్‌ సన్నిహితుడి ఇంటిపై గురువారం కాల్పులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఆ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి.  

Updated : 02 Feb 2024 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-కెనడాల మధ్య పెను దౌత్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య సంఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకొంది. బ్రిటీష్‌ కొలంబియా పరిధిలోని దక్షిణ సర్రేలోని సిమ్రన్‌జీత్‌ సింగ్‌ ఇంటిపై కాల్పులు జరిగాయి. అతడు నిజ్జర్‌కు స్నేహితుడు. ఈ విషయాన్ని కెనడాకు చెందిన సీబీఎన్‌ న్యూస్‌ పేర్కొంది. దీనిపై సర్రే పోలీసులు (ఆర్‌సీఎంపీ) స్పందిస్తూ.. గురువారం తెల్లవారుజామున 1.20 సమయంలో స్థానిక 154 స్ట్రీట్‌లోని 2800 బ్లాక్‌ వద్ద కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. 

కాల్పుల్లో దెబ్బతిన్న ఒక కారును అక్కడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకొన్నట్లు గురువారం మధ్యాహ్నం వార్తలొచ్చాయి. ఆ ఇంటి తలుపులపై దాదాపు 10 వరకు తూటాలు దిగినట్లు తెలుస్తోంది. మొత్తం ఎన్ని రౌండ్లు కాల్పులు జరిగాయనే విషయాన్ని మాత్రం అధికారులు చెప్పడం లేదు. ‘‘ఇప్పట్లో తాము ఏ విషయం స్పష్టంగా చెప్పలేమని కార్పొరల్‌ సరబ్‌జీత్‌ సంగా పేర్కొన్నారు. 

స్థానిక ఖలిస్థానీ గ్రూపులు మాత్రం ఈ దాడి వెనక భారత్‌ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. ఇటీవల భారత్‌ కాన్సులేట్‌ వద్ద నిర్వహించిన ఆందోళనలో సిమ్రన్‌జీత్‌ కీలకపాత్ర పోషించడంతోనే ఈ దాడి జరిగిందని వారు చెబుతున్నారు. ‘‘నిజ్జర్‌తో సిమ్రన్‌జీత్‌కు ఉన్న సంబంధం కూడా ఈ దాడికి కారణం కావచ్చు. ఖలిస్థానీ వాదనను బలంగా వినిపించేవారిలో అతనొకరు. ఈ దాడి వెనక భారత హస్తం ఉందని అతడు నమ్ముతున్నాడు. ఇటువంటి కాల్పులు అతడిని భయపెట్టలేవు’’ అని బ్రిటీష్‌ కొలంబియా గురుద్వారా కౌన్సిల్‌ ప్రతినిధి మహీందర్‌సింగ్‌ అన్నారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను గతేడాది జూన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన భారత్‌ -కెనడాల మధ్య దౌత్య వివాదానికి దారి తీసింది. దీనిలో న్యూదిల్లీ ఏజెంట్ల హస్తం ఉందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో బహిరంగ వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు