Elon Musk: వారిని క్షమించాలా..? మరోసారి మస్క్‌ ట్విటర్‌ పోల్‌..!

మస్క్‌ మరోసారి ట్విటర్‌ పోల్‌ నిర్వహించాడు. అమెరికా రహస్యాలు బయటపెట్టిన అసాంజే,స్నోడెన్‌లకు క్షమాభిక్ష పెట్టాలా అన్న అంశంపై ఇది జరిగింది.

Published : 04 Dec 2022 11:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా చీకటి రహస్యాలను బయటపెట్టిన ప్రజా వేగులు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌, వికీ లీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేలకు అమెరికా ప్రభుత్వం  క్షమాభిక్ష పెట్టాలా..? అన్న అంశంపై మస్క్‌ ట్విటర్‌ పోల్‌ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో కొన్ని గంటల్లోనే  లక్షల మంది పాల్గొన్నారు. దీనిలో చాలా మంది వారిద్దరిపట్లా సానుకూలంగానే స్పందించారు. ‘నేను నా అభిప్రాయం చెప్పడంలేదు. కానీ, ఈ పోల్‌ నిర్వహిస్తానని వాగ్దానం చేశాను’.. ‘అసాంజే, స్నోడెన్‌లకు క్షమాభిక్ష పెట్టాలా..?’ అని ప్రశ్నిస్తూ మస్క్‌ ట్విటర్‌ పోల్‌ ఏర్పాటు చేశారు. ఈ పోల్‌ పెట్టిన 21 గంటల్లో 11,39,986 మంది పాల్గొన్నారు. వీరిలో 79శాతం మంది అసాంజే, స్నోడెన్‌లకు క్షమాభిక్ష పెట్టడానికి సానుకూలంగా స్పందించారు. 21 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్‌ వర్గాల నిఘా కార్యక్రమాలకు సంబంధించిన కీలక సమాచారాలను స్నోడెన్‌, అసాంజెలు బహిర్గతం చేశారు. దీంతో అమెరికా వారి కోసం వేట మొదలుపెట్టింది.

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేసిన నాటి నుంచి తరచూ పలు అంశాలపై పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్‌ ఖాతా పునరుద్ధరణ విషయంలో కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో శాంతి ప్రతిపాదనలపై వీటిని నిర్వహించాడు. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. దీన్ని ఉద్దేశిస్తూ ఆ మధ్య మస్క్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘1) రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలి. ఒకవేళ ప్రజల తీర్పు ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాన్ని వీడాలి. 2) 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. (1954లో సోవియెట్‌ పాలకుడు కృశ్చేవ్‌.. క్రిమియాను ఉక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చారు)  దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. 3) ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. అలాగే తన ప్రణాళికను ఓటింగ్‌లో పెట్టారు. అయితే దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా పలువురు ఉక్రెయిన్‌ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల జెలెన్‌స్కీ మాట్లాడుతూ మస్క్‌ ఉక్రెయిన్‌ వచ్చి పరిస్థితులను చూసి మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని