Singapore Airlines flight: 5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్‌ విమానంలో భయానక దృశ్యాలు

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం మార్గమధ్యలో తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని విమానాశ్రయానికి మళ్లించారు.

Published : 22 May 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లండన్‌ నుంచి సింగపూర్‌కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి వస్తువులు జారి పడుతున్నాయి.. సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు ఎగిరి పడుతున్నారు.. ఆకాశం నుంచి ఒక్క ఉదుటన దూకేసినట్లుగా ఉంది పరిస్థితి. ఆ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానమంతా చిందర వందర.. రక్తపు మరకలు.. ఇదీ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో నెలకొన్న పరిస్థితి.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో 31 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 6 వేల అడుగులు కిందకు దిగిందని ఫ్లైట్‌ రాడార్‌ 24 డేటాను బట్టి తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. విమానంలోని ఓవర్‌ హెడ్‌ బిన్స్‌, దుప్పట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. మాస్కులు, లైటింగ్‌, ఫ్యాన్‌ ప్యానెల్స్‌ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాయి. ఇలాంటి సమయాల్లో సీటు బెల్టులు పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉండదని, అందుకే ప్రయాణికులకు గాయాలవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఏ సమయంలో  ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీటు బెల్టును ఎల్లవేళలా ధరించడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని