Robert Fico: అందుకే ప్రధాని రాబర్ట్‌ ఫికోపై కాల్పులు జరిపా.. అంగీకరించిన నిందితుడు

స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59)ను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై కాల్పులు జరపలేదని,  ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో కేవలం ఆయన్ను గాయపరచాలనే దాడి చేశానని 71 ఏళ్ల నిందితుడు అంగీకరించాడు.

Published : 24 May 2024 00:14 IST

ప్రేగ్‌: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59)ను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై కాల్పులు జరపలేదని,  ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో కేవలం ఆయన్ను గాయపరచాలనే దాడి చేసినట్లు 71 ఏళ్ల నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు 9 పేజీల దర్యాప్తు నివేదికను అధికారులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే అతడిని నిర్బంధించాలని ఆదేశించింది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను బహిర్గతం చేసింది.

నిందితుడు గతంలో ఓ షాపింగ్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. 30 ఏళ్లుగా తుపాకీ వినియోగిస్తున్నాడు. అయితే, ఈ దాడి వెనుక కారణం గురించి అతడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మరోవైపు తన చర్యపై పశ్చాత్తాప పడుతున్నట్లు, ప్రధానికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిందితుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. ప్రభుత్వ విధానాలు, యూఎస్‌పీ రద్దు, మీడియాపై వేధింపులు తదితర చర్యలను పూర్తిగా విభేదించినందువల్లే కాల్పులు జరిపానని నిందితుడు అంగీకరించినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు సైనిక సాయం చేయాలన్నది అతడి ప్రధాన డిమాండ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

మే 15న ఫికోపై కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్సపొందుతూ కోలుకుంటున్నారు.  దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికో తన మద్దతుదారులతో సమావేశమైన అనంతరం బయటకు రాగానే ఆయనపై నిందితుడు కాల్పులు జరిపాడు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. దీంతో ప్రధాని కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను బన్‌స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఫికో రష్యా అనుకూలవాది. ప్రస్తుతం మూడో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని