Fake News: ఎక్స్‌ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్‌ తొలగింపు..!

ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేసే నకిలీ వార్తలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన కీలక ఫీచర్‌ను కొన్నిదేశాల్లో తొలగించారు. ఇది ఆందోళన కలిగించే విషయమని సోషల్‌ మీడియా పర్యవేక్షణ సంస్థలు వాపోతున్నాయి.

Updated : 28 Sep 2023 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఎన్నికల వార్తల (Fake News) వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రత్యేక ఫీచర్‌ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియాలో చేసే నకిలీ పోస్టులపై ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ఎక్స్‌కు ఫిర్యాదు చేయొచ్చు. తాజాగా కొన్ని దేశాల్లోని ఎక్స్‌లో ఈ ఫీచర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన రీసెట్‌.టెక్‌ అనే సంస్థ దీనిని ధ్రువీకరించింది. ఈ సంస్థ స్వచ్ఛందంగా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల పనితీరును పర్యవేక్షిస్తుంది. యూజర్లు ఎక్స్‌లో తమకు ఏదైనా పోస్ట్‌ లేదా లింక్‌ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయనే అనుమానం కలిగితే దానిపై ఫిర్యాదు చేయొచ్చు. ఇందులో వివిధ రకాల కేటగిరీలు ఉంటాయి. తాజాగా వీటి నుంచి పాలిటిక్స్‌ కేటగిరీని తొలగించినట్లు రీసెట్‌.టెక్‌ వెల్లడించింది.

త్వరలో అమెరికా, ఆస్ట్రేలియాలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను తొలగించడం ఆందోళనకరమని రీసెట్‌ పేర్కొంది. 2021లో తొలిసారిగా అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం 2022లో బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌, స్పెయిన్‌లో పరిచయం చేశారు. త్వరలో ఇతర దేశాల్లోను అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియాలో ఈ ఫీచర్‌ను తొలగించడంతో ఎక్స్‌పై విమర్శలు వస్తున్నాయి. దీని గురించి వివరణ కోరేందుకు ఎక్స్‌ను సంప్రదించగా ఎలాంటి స్పందన లేదని రీసెట్‌.టెక్‌ తెలిపింది. మరోవైపు అక్టోబరు 14న ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలా?వద్దా? అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చే నకిలీ వార్తల గురించి ఎక్కడ ఫిర్యాదు చేయాలనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు యూరోపియన్‌ యూనియన్‌లో ఈ ఫీచర్‌ ఇప్పటికీ అందుబాటులో ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని