Social Media: సోషల్‌ మీడియా యాక్టివ్‌ యూజర్లు @ 500 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 500 కోట్లకు చేరినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 21 Jul 2023 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్నెట్‌ సేవలు సులభతరం కావడంతో కొన్నేళ్లుగా సోషల్‌ మీడియా (Social Media) వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఏకంగా 60 శాతానికిపైగా ప్రజలు సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ జనాభా ఇటీవలే 800 కోట్ల మార్కును దాటగా.. జులై నాటికి అందులో సోషల్‌ మీడియా వేదికల్లో దాదాపు 500 కోట్ల (4.88 బిలియన్‌ యూజర్‌ ఐడెంటిటీస్‌) మంది యాక్టివ్‌గా ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 3.7శాతం పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వినియోగానికి సంబంధించి కెపియోస్‌ అనే డిజిటల్‌ అడ్వైజరీ సంస్థ తాజా గణాంకాలను వెల్లడించింది. ప్రతి 10 మంది ఇంటర్నెట్‌ యూజర్లలో తొమ్మిదిమంది వీటిని వాడుతున్నట్లు పేర్కొంది. ప్రతి సెకనుకు కొత్తగా చేరేవారి సంఖ్య సరాసరి 5.5గా ఉన్నట్లు తెలిపింది. ఇలా గడిచిన ఏడాదిలోనే కొత్తగా 17.3 కోట్ల మంది.. సోషల్‌ మీడియాలో చేరినట్లు అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో భిన్న విధాలుగా వీటి వినియోగం ఉందని పేర్కొంది.

ఇక స్మార్ట్‌వాచీల్లోనూ వాట్సప్‌ సేవలు

తూర్పు, మధ్య ఆఫ్రికాలో ప్రతి 11 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారని తెలిపింది. అదే భారత్‌లో మాత్రం ప్రతి ముగ్గురిలో ఒకరు ఉపయోగిస్తున్నారట. ఇక సోషల్‌ మీడియాలో గడిపే సమయం విషయానికొస్తే.. ఒక్కో యూజర్‌ రోజులో దాదాపు 2.26 గంటలపాటు వాటిలోనే గడుపుతున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా బ్రెజిలియన్లు రోజుకు 3.49 గంటలపాటు వాటిలో మునిగితేలుతుండగా.. జపాన్‌లో మాత్రం ఈ సమయం గంటకు తక్కువగానే ఉన్నట్లు వెల్లడైంది.

ఏడు మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తుండగా.. ఇందులో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు మెటా సంస్థకు చెందినవి. తదుపరి చైనాకు చెందిన వీచాట్‌, టిక్‌టాక్‌తోపాటు డౌయిన్‌లు ఉన్నాయి. వీటితోపాటు ట్విటర్‌, మెసెంజర్‌, టెలిగ్రామ్‌ యాప్‌ల వినియోగం కూడా గణనీయంగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, డూప్లికేట్‌ అకౌంట్ల కారణంగా ఒక్కో అకౌంటును ఒక్కో వ్యక్తిగా పేర్కొనలేమని.. అలా చేస్తే ప్రపంచ జనాభాకంటే ఎక్కువ సంఖ్య ఉంటుందని తాజా నివేదిక తెలిపింది. అందుకే వీటిని సోషల్‌ మీడియా యూజర్‌ ‘ఐడెంటిటిస్‌’గా పేర్కొన్నామని కెపియోస్‌ స్పష్టతనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని