Kremlin: ఇంటిపేరు మార్చుకుని.. ఉక్రెయిన్‌ యుద్ధంలో క్రెమ్లిన్‌ ప్రతినిధి కుమారుడు!

ఉక్రెయిన్‌పై చేపడుతోన్న సైనిక చర్యలో పాల్పంచుకున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ కుమారుడు నికొలాయ్‌ పెస్కొవ్‌ వెల్లడించాడు. తన ఇంటి పేరు మార్చుకుని, వాగ్నర్‌ దళంతో పనిచేసినట్లు చెప్పాడు.

Published : 25 Apr 2023 01:46 IST

మాస్కో: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) సైనిక చర్య ఏడాదికిపైగా సాగుతోన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలకు తోడు కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ (Wagner Group) సైతం మాస్కో తరఫున దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే క్రెమ్లిన్‌ (Kremlin) అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ (Dmitry Peskov) తనయుడు నికొలాయ్‌ పెస్కొవ్‌ (Nikolai Peskov).. తాను సైతం ఈ దాడుల్లో పాలుపంచుకున్నట్లు ప్రకటించాడు. వాగ్నర్‌ దళాలతో కలిసి ఉక్రెయిన్‌లో ఆర్నెళ్లపాటు పనిచేసినట్లు తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘నా స్నేహితులు, ఇతరులు ఉక్రెయిన్‌లో పోరాటానికి వెళ్తుండటాన్ని చూశా. బాధ్యతగా భావించి నేనూ ముందుకొచ్చా. తండ్రి దిమిత్రి పెస్కొవ్‌ సహకారంతో యుద్ధంలో భాగమయ్యా’ అని నికొలాయ్‌ పెస్కోవ్ వెల్లడించాడు. ‘యుద్ధక్షేత్రానికి వెళ్లినప్పుడు.. నా ఇంటిపేరు మార్చుకున్నా. నకిలీ పత్రాలతో అడుగుపెట్టా. నేనెవరో అక్కడ ఎవరికీ తెలియదు’ అని తెలిపాడు. దాదాపు ఆర్నెళ్లపాటు సేవలందించానని, గుర్తింపుగా పతకం కూడా అందుకున్నట్లు చెప్పాడు. సైనిక చర్యకు కేవలం సామాన్య పౌరులనే పంపుతున్నారని.. ప్రభుత్వ, ఉన్నత వర్గాలవారిని దూరంగా ఉంచారంటూ రష్యా ప్రభుత్వంపై స్థానికంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

క్రెమ్లిన్ ప్రతినిధి కుమారుడు తన దళంలో పనిచేశాడని వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘అతను మందుగుండు సామగ్రి సరఫరా వాహనం లోడర్‌గా పనిచేశాడు. అంతకుముందు మోల్కినోలోని వాగ్నర్‌ స్థావరంలో మూడు వారాల శిక్షణకు హాజరయ్యాడు. అనంతరం లూహాన్స్క్‌కు వెళ్లాడు’ అని చెప్పాడు. దిమిత్రి పెస్కొవ్‌ సైతం తన తనయుడు సైనిక చర్యలో భాగమయ్యడన్న విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం నికొలాయ్‌, దిమిత్రి పెస్కొవ్‌లిద్దరూ ప్రపంచ దేశాల ఆంక్షల జాబితాలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని