Korea: ఉ.కొరియా వర్సెస్‌ ద.కొరియా.. ‘మిలటరీ డీల్‌’ రద్దుకు ‘సై’

తమ భూభాగంలో చెత్త, వ్యర్థాలతో కూడిన వందల బెలూన్లను ఉత్తర కొరియా జారవేయడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కొరియా తదుపరి చర్యలకు ఉపక్రమించింది.

Published : 03 Jun 2024 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలో చెత్త, వ్యర్థాలతో కూడిన వందల బెలూన్లను ఉత్తర కొరియా జారవిడవడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కొరియా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా కిమ్‌ రాజ్యంతో చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి మంగళం పాడనున్నట్లు పేర్కొంది. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం పునరుద్ధరణ జరిగేవరకు ‘సెప్టెంబర్‌ 19 మిలటరీ ఒప్పందం’ను నిలిపివేయాలని కేబినెట్‌కు చెప్పనున్నట్లు దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ వెల్లడించింది.

వారం రోజులుగా దక్షిణ కొరియా భూభాగంలోకి చెత్త, మురికితో కూడిన వందల సంఖ్యలో బెలూన్లను ఉత్తర కొరియా జారవిడిచింది. ఇప్పటివరకు మొత్తంగా వెయ్యికిపైగా బెలూన్లను వేసినట్లు అంచనా. దక్షిణ కొరియా కార్యకర్తలు తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా వీటిని పంపించినట్లు సమాచారం. వీటిని ప్రతిచర్యగా పేర్కొన్న కిమ్‌ సామ్రాజ్యం.. అవసరమైతే మరిన్ని పంపిస్తామని హెచ్చరించింది. పొరుగు దేశ చర్యలపై తీవ్రంగా మండిపడిన దక్షిణ కొరియా.. అవి అసంబద్ధమైన, దిగజారుడు చర్యలని పేర్కొంది.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2018లో ఇరుదేశాలు ఓ సైనిక ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దులో కవ్వింపులు, శత్రుత్వాలు తీవ్రతరం కాకుండా నివారించడం, ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా వీటిపై సంతకాలు చేశాయి. అయితే, గతేడాది ఉ.కొరియా నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సియోల్‌.. ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తాజాగా దానికి పూర్తి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఉత్తర కొరియా కూడా ఆ ఒప్పందాన్ని తామూ గౌరవించడం లేదని పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు