South Korea: ఉత్తరకొరియా రాకెట్‌ శకలాలు మా దగ్గరున్నాయి: దక్షిణ కొరియా

ఉత్తరకొరియా రాకెట్‌కు చెందిన కీలక శకలాలు దక్షిణ కొరియా చేతికి చిక్కాయి. వీటిని విశ్లేషించి ఆ దేశం వాడిన సాంకేతికతను గుర్తిస్తామని ఆ దేశం పేర్కొంది.

Updated : 16 Jun 2023 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా ప్రయోగించిన రాకెట్‌ శకలాలు దక్షిణ కొరియాకు దొరికాయి. గత నెల ఉ.కొరియా ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ప్రయత్నించగా.. అది విఫలమైంది. అప్పట్లో ఆ రాకెట్‌, ఉపగ్రహ శకలాలు దక్షిణ కొరియా వద్ద సముద్రంలో కూలిపోయాయి. వీటిని గురువారం సాయంత్రం వేళ దక్షిణ కొరియా సైన్యం సముద్రం నుంచి వెలికి తీసింది. ఈ విషయాన్ని ఆ దేశ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ శుక్రవారం వెల్లడించారు. కీలకమైన ఉపగ్రహ శకలాల కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు.

ఉ.కొరియా ప్రయోగం మధ్యలోనే విఫలమై.. శకలాలు దక్షిణ కొరియా పశ్చిమ తీరంలో కూలిపోయాయి. దీంతో వెంటనే సియోల్‌ బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ శకలాలను సేకరించి ఉత్తరకొరియా వాడుతున్న టెక్నాలజీని దక్షిణ కొరియా అంచనా వేయనుంది. ఇప్పటి వరకు చోన్మా (రెక్కల గుర్రం) అని రాసి ఉన్న ఓ భారీ సిలిండర్‌ వంటి వస్తువును స్వాధీనం చేసుకొన్నారు. ఈ ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్‌ పేరు చొల్లిమా-1గా గుర్తించారు. ఈ విషయాన్ని ద.కొరియా ఏజెన్సీ ఫర్‌ డిఫెన్స్‌ డెవలప్‌మెంట్‌ పేర్కొంది. ఈ పరికరాలు రాకెట్‌ రెండో దశకు చెందినవిగా భావిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి లీ జోంగ్‌ సుప్‌ పేర్కొన్నారు.

ఉ.కొరియా పెంపొందించుకుంటున్న సాంకేతికతపై గతంలోనే సరిహద్దు దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రయోగ సమయంలో ద.కొరియా రాజధాని సియోల్‌లో గందరగోళం ఏర్పడింది. ప్రజలకు అత్యవసర సందేశాలు పంపించారు. 

మరోవైపు చైనా యుద్ధ నౌక కూడా రాకెట్‌ కూలిన ప్రదేశానికి సమీపంలో శకలాల కోసం గాలింపు చేపట్టడం విశేషం. చైనా ఇలా పరాయి దేశాల సాంకేతికతను సంపాదించడం కోసం గాలింపులు చేపట్టడం  కొత్తకాదు. ఎఫ్‌-117 అనే అత్యాధునిక అమెరికా స్టెల్త్‌ విమానం 1999లో సెర్బియాలో కూలిపోయింది. ఆ విమాన శకలాలను చైనా సంపాదించి.. తాజాగా జే-20 స్టెల్త్‌ జెట్‌ను తయారు చేసింది. తాజాగా ఉ.కొరియా రాకెట్‌ శకలాలను విశ్లేషించి.. దాని సాంకేతికతను తెలుసుకునే పనిలో దక్షిణ కొరియా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు