Entrance Exam: ఆ 8 గంటల పరీక్షలో.. ‘కిల్లర్‌ క్వశ్చన్స్‌’ ఉండవ్‌..!

యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం దక్షిణ కొరియా (South Korea) నిర్వహించే ఓ పరీక్షలో కిల్లర్‌ క్వశ్చన్లను లేకుండా చూస్తామని అక్కడి విద్యాశాఖ వెల్లడించింది.

Updated : 20 Jun 2023 20:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం దక్షిణ కొరియా (South Korea) నిర్వహించే ఓ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే, అందులో వచ్చే కొన్ని కఠినమైన ప్రశ్నలు అక్కడి యువతలో తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయని నివేదకలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ పరీక్షలో (Entrance Exam) కీలక మార్పులకు ద.కొరియా ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో ‘కిల్లర్‌ క్వశ్చన్లు’గా పిలిచే ప్రశ్నలను ఇకనుంచి లేకుండా చూస్తామని దక్షిణ కొరియా విద్యాశాఖ ప్రకటించింది.

సుదీర్ఘ పరీక్ష..

దక్షిణ కొరియాలో పన్నెండో తరగతి పాసైన విద్యార్థులు యూనివర్సిటీలో చేరడానికి ‘సన్‌అంగ్‌’ (Suneung) అనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా నవంబరులో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు భారీ పోటీ ఉంటుంది. ఒకేరోజు ఎనిమిది గంటలపాటు జరిగే ఈ పరీక్షకు దాదాపు 5లక్షల మంది హాజరవుతుంటారు. కొరియా భాషతో పాటు ఇంగ్లిష్‌, గణితం, చరిత్ర, సైన్సు తదితర సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యాలను విశ్లేషించే ప్రశ్నలుంటాయి. కేవలం కాలేజీ భవితనే కాకుండా కెరీర్‌, వివాహం వంటి విషయాల్లోనూ ఈ పరీక్ష కీలక పాత్ర వహిస్తుందట.

విద్యార్థులకు శాపం..

అయితే, అందులో వచ్చే కొన్ని కఠిన ప్రశ్నలను ‘కిల్లర్‌ క్వశ్చన్స్‌’గా పేర్కొంటుంటారు. సాధారణ విద్యార్థులకు ఇవి శాపంగా మారుతున్నాయనే వాదన ఉంది. ఈ పరీక్షలో గట్టెక్కేందుకు ప్రైవేటు ట్యూషన్లను పెట్టుకోవడం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారడంతోపాటు విద్యార్థులనూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని తేలింది. మరోవైపు విద్యావ్యవస్థలో తీవ్ర పోటీ కారణంగా పిల్లల్లో ఒత్తిడి, ఆత్మహత్యల రేటు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా పరీక్షల తీరుపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో వీటిలో మార్పులు చేయాలని ద.కొరియా విద్యాశాఖ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు అటువంటి ప్రశ్నలు ఉండకుండా దీన్ని రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి లీ జూ-హో ప్రకటించారు.

విమానాలూ నిలిపివేస్తారు..

సన్‌అంగ్‌ పరీక్ష జరిగే రోజున దేశం మొత్తం నిశ్శబ్దంగా మారుతుంది. టీవీలూ మ్యూజిక్‌ సిస్టమ్స్‌ మూగబోతాయి. రోడ్లమీద ట్రాఫిక్‌ పిల్లలకు అడ్డం రాకూడదని కోర్టులూ బ్యాంకులూ స్టాక్‌మార్కెట్‌తో సహా కార్యాలయాలన్నిటినీ కొద్దిపాటి సిబ్బందితో ఆలస్యంగా ప్రారంభించి త్వరగా మూసేస్తారు. భాషకి సంబంధించిన పరీక్షలో విని రాయాల్సింది ఉంటుంది. అందుకని వారి ఏకాగ్రతకి భంగం కలగకుండా చూడడానికి దేశమంతటా విమానాల రాకపోకల్ని నిలిపేస్తారు. మిలిటరీ శిక్షణ, నిర్మాణ పనులనూ ఆపేస్తారు. విద్యార్థుల కోసం బస్సులు, ట్యాక్సీలను ఉచితంగా నడుపుతారు. పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలు కూడా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని