South Korea: దక్షిణ కొరియాలో ఘోరం.. ప్రతిపక్ష నేతపై కత్తి దాడి!

South Korea: బుసన్‌ అనే నగర పర్యటనలో ఉండగా.. దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూంగ్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు.

Updated : 02 Jan 2024 15:13 IST

సియోల్‌: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూంగ్‌పై (Lee Jae myung) గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. బుసన్‌ అనే నగరంలో పర్యటిస్తున్న సమయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ పనులను పరిశీలిస్తుండగా.. దుండగుడు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు.

డెమొక్రాటిక్‌ పార్టీ నేత అయిన మ్యూంగ్‌ (Lee Jae myung).. దాడి తర్వాత స్పృహలోనే ఉన్నారని ఎమర్జెన్సీ ఆఫీస్‌ అధికారులు తెలిపారు. కానీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది మాత్రం కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. ఒక కత్తితో దుండగుడు మ్యూంగ్‌ మెడపై పొడిచినట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు వెల్లడించాయి. 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ చేతిలో లీ జే మ్యూంగ్‌ (Lee Jae myung) ఓడిపోయారు.

దాడికి పాల్పడిన దుండగుణ్ని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడు కిరీటం తరహాలో ఉన్న ఓ వస్తువును తలపై ధరించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. లీ జే మ్యూంగ్‌ ఏ విషయంపైనైనా బాహాటంగానే తన అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఆయనకు పేరుంది. మద్దతుదారులు ఆయన్ని రాజకీయాలను సంస్కరించే, అవినీతిని నిర్మూలించగల, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను పరిష్కరించగల నాయకుడిగా చూస్తారు. అదే సమయంలో విమర్శకులు అతన్ని ప్రమాదకరమైన ప్రజానాయకుడిగా అభివర్ణిస్తుంటారు. ప్రజల మధ్య విభజనకు దారితీస్తుంటారని విమర్శిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని