Age System: ఆ ప్రజల వయసు తగ్గనుంది.. ఎందుకో తెలుసా..!

దక్షిణ కొరియాలో (South Korea) ఇప్పటివరకు పౌరుల వయసు లెక్కింపునకు భిన్నవిధాలను అనుసరించగా.. బుధవారం నుంచి అంతర్జాతీయ లెక్కింపు విధానాన్ని (International Age System) పాటించనుండటంతో అక్కడి పౌరులందరి వయసు ఒకటి, రెండేళ్లు తగ్గనుంది.

Updated : 28 Jun 2023 17:31 IST

సియోల్‌: దక్షిణ కొరియా (South Korea) పౌరుల వయసు తగ్గనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అవును, ఇప్పటివరకు పౌరుల వయసు లెక్కింపునకు భిన్నవిధానాలను అనుసరించిన దక్షిణ కొరియా.. బుధవారం నుంచి అంతర్జాతీయ విధానాన్ని (International Age System) పాటించనుంది. దీంతో అక్కడి పౌరులందరి వయసు ఒకటి, రెండేళ్లు తగ్గనుంది.

ఒకే పౌరుడికి మూడు వయసులు..

దక్షిణ కొరియా పౌరుల వయసును ఇప్పటివరకు మూడు విధానాలుగా లెక్కిస్తున్నారు. అంతర్జాతీయ వయసు, కొరియన్‌ వయసు (Korean Age), క్యాలెండర్‌ వయసు.. ఇలా ఒక్కో వ్యక్తికి మూడు వయసులను పేర్కొనేవారు. అంతర్జాతీయ విధానం ప్రకారం శిశువు పుట్టినప్పుడు వారి వయసు ‘సున్నా’ నుంచి మొదలవుతుంది. ఆపై.. వచ్చే ఏడాది అదే తేదీనాటికి ఒకటి ఏడాది పూర్తవుతుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. కొరియన్‌ ప్రకారం, శిశువు పుట్టగానే ఒక ఏడాది వయసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రతి జనవరి 1న ఒక్కో ఏడాది జోడిస్తారు. క్యాలెండర్‌ విధానం ప్రకారం, శిశువు పుట్టినప్పుడు వయసు సున్నాగానే ఉంటుంది. అనంతరం.. ప్రతి జనవరి 1న మరో సంవత్సరం కలుపుతారు.

ఉదాహరణకు దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యక్తి డిసెంబరు 31న జన్మిస్తే.. జనవరి 1నాటికి కొరియన్‌ విధానం ప్రకారం అతడి వయసు రెండేళ్లు అవుతుంది. క్యాలెండర్‌ ప్రకారం ఏడాదిలో ఎప్పుడు పుట్టినా.. జనవరి 1 నుంచే అతడి వయసు లెక్కింపులోకి వస్తుంది. అదే అంతర్జాతీయ ప్రామాణికంగా తీసుకుంటే ఏ తేదీన పుడితే.. అప్పటి నుంచి ఒక్కోరోజు లెక్కింపులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

గందరగోళానికి తెర..

ఇలా దక్షిణ కొరియా పౌరులు తమ రోజువారీ జీవితంలో, సామాజిక అంశాల్లో కొరియన్ వయసును ఉపయోగిస్తారు. చట్టపరమైన, అధికారిక విషయాల్లో అంతర్జాతీయ వయసు నమోదు చేస్తారు. మద్యపానం, ధూమపానం, నిర్బంధ సైనిక శిక్షణ వంటి విషయాల్లో క్యాలెండర్‌ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు ఇన్సూరెన్సు పాలసీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఒక్కో వయసును పేర్కొనడంతో వివాదంగా మారుతున్నాయి. ఈ గందరగోళానికి తెరదించిన అక్కడి పార్లమెంటు.. జూన్‌ 28 నుంచి పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి మూడోవంతు పౌరులు మద్దతు తెలుపుతున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని