SpaceX: స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం.. గాల్లోనే పేలిపోయిన అతిపెద్ద రాకెట్‌..!

స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్‌ కొద్ది సేపటికే పేలిపోయింది.

Updated : 20 Apr 2023 20:23 IST

వాషింగ్టన్‌: ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ (SpaceX) చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ‘స్టార్‌షిప్‌ (Starship)’ ప్రయోగం విఫలమైంది. అమెరికా (America) దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్‌.. కొద్దిసేపటికే పేలిపోయింది. టెస్ట్‌ ఫ్లైట్‌లో భాగంగా ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడిపోవాలి. కానీ, అంతకుముందే పేలిపోయింది. ఈ ప్రయోగ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని ‘స్పేస్‌ఎక్స్‌’ వెల్లడించింది. నేటి వైఫల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని.. సిబ్బందిని అభినందిస్తూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు.

‘స్టార్‌షిప్‌’ పొడవు ఏకంగా 120 మీటర్లు(400 అడుగులు) ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి దీన్ని టెస్ట్‌- ఫ్లైట్‌ కోసమే ప్రయోగించారు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు సాగే టెస్ట్‌ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా రూపొందించారు. స్పేస్‌క్రాఫ్ట్‌ మాత్రం భూమి చుట్టు దాదాపు ఒక పరిభ్రమణం సాగించి, హవాయి సమీపంలో పడిపోయేలా తయారుచేశారు. గత సోమవారమే దీని ప్రయోగానికి అంతా సిద్ధం చేయగా.. సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో వాయిదా పడింది. నేడు ప్రయోగించగా.. ఊహించని విధంగా విఫలమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని