SpaceX: గమ్యం చేరని ‘స్టార్‌షిప్‌’.. అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం రెండోసారి విఫలం!

ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘స్టార్‌షిప్‌’ రాకెట్‌ను స్పేస్‌ఎక్స్‌ సంస్థ రెండోసారి విఫలమైంది

Updated : 18 Nov 2023 20:20 IST

వాషింగ్టన్‌: ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్టార్‌షిప్‌ (Starship)’ భారీ రాకెట్‌ ప్రయోగం రెండోసారీ విఫలమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ రాకెట్‌ తొలుత నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. రెండు దశల (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌) ఈ రాకెట్‌ టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా.. 2.48 నిమిషాల తర్వాత బూస్టర్‌ విడిపోయింది. కానీ, ఆ వెంటనే అది పేలిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్‌ ముందుకు దూసుకెళ్లినా.. కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్‌ తెగిపోయింది. దీంతో రాకెట్‌ దారితప్పకుండా దాన్ని పేల్చేసినట్లు సమాచారం. ‘మనం నేర్చుకునే దాని నుంచే విజయం వస్తుంది. నేటి ప్రయోగం.. స్టార్‌షిప్ విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని స్పేస్‌ఎక్స్‌ ట్వీట్‌ చేసింది.

మరోవైపు ఎలాన్‌ మస్క్‌.. స్పేస్‌ఎక్స్‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్‌షిప్‌ మొదటి టెస్ట్‌ఫ్లైట్‌ విఫలమైన విషయం తెలిసిందే. గాల్లోకి ఎగిరిన కేవలం 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఇది కూలిపోయింది. దీంతో తొలి ప్రయోగంలోని వైఫల్యాలను విశ్లేషించి.. రాకెట్‌, ల్యాంచ్‌ ప్యాండ్‌లను ‘స్పేస్‌ఎక్స్‌’ మరింత అభివృద్ధి చేసింది. అమెరికా గగనతల నిర్వహణ సంస్థ (FAA) సూచించిన 57 మార్పులూ చేపట్టింది. ఎఫ్‌ఏఏ అనుమతి అనంతరం శనివారం రెండోసారి పరీక్షించినా.. విఫలమైంది. ఇదిలా ఉండగా.. స్టార్‌షిప్‌ రాకెట్‌ పొడవు ఏకంగా 121 మీటర్లు(400 అడుగులు) కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరుపొందిన దీన్ని.. చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా ‘స్పేస్‌ఎక్స్‌’ రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని