Starship: ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌.. చివరి క్షణంలో ప్రయోగం వాయిదా!

ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ ఈ వ్యోమనౌకను రూపొందించింది.

Published : 17 Apr 2023 23:03 IST

వాషింగ్టన్‌: అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించాలనుకున్న ఎలాన్‌ మస్క్‌(Elon Musk)కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’ సంస్థకు మరింత నిరీక్షణ తప్పేలా లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగానికి అన్ని సిద్ధం చేసుకోగా.. చివరి క్షణంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తమ రాకెట్‌ను తిరిగి ఎప్పుడు ప్రయోగిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ ట్వీట్‌ చేసింది.

రెండు సెక్షన్ల (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌) ఈ ‘స్టార్‌షిప్‌ (Starship)’ రాకెట్‌ పొడవు ఏకంగా 120 మీటర్లు(400 అడుగులు) ఉండటం గమనార్హం. అమెరికా దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.50 సమయంలో ఇది నింగిలోకి దూసుకెళ్లాల్సింది. కానీ, చివరి క్షణంలో ప్రయోగం వాయిదా పడింది. ప్రస్తుతానికి దీన్ని టెస్ట్‌- ఫ్లైట్‌ కోసమే ప్రయోగించనున్నారు.

ఈ భారీ వ్యోమనౌక దాదాపు 250 టన్నుల బరువును మోయగలదు. 100 మందిని అంతరిక్షయానానికి తీసుకెళ్లగలదు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు సాగే టెస్ట్‌ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా దీన్ని రూపొందించారు. స్పేస్‌క్రాఫ్ట్‌ మాత్రం భూమి చుట్టు దాదాపు ఒక పరిభ్రమణం సాగించి, హవాయి సమీపంలో పడిపోయేలా తయారుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని