Letter Bombs: ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. పోస్టల్‌ బాంబుల కలకలం..!

ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోన్న వేళ.. స్పెయిన్‌లో పోస్టుల్‌ బాంబులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఇక్కడి ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయానికి వచ్చిన పార్శిల్‌ తెరిచే సమయంలో పేలుడు సంభవించింది. ఇలా ఇప్పటివరకు ఐదు లెటర్‌ బాంబులను పోలీసులు గుర్తించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా చేస్తోన్నస్పెయిన్‌ లక్ష్యంగానే ఈ లెటర్‌ బాంబులు వస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 02 Dec 2022 01:34 IST

మాద్రిద్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం (Ukraine Crisis) కొనసాగుతోన్న వేళ.. ఆ దేశానికి అండగా నిలుస్తోన్న స్పెయిన్‌ను పోస్టల్‌ బాంబులు (Letter Bomb) కలవరపెడుతున్నాయి. తాజాగా స్పెయిన్‌ రక్షణ శాఖకు వచ్చిన పోస్టల్‌ ప్యాకేజీలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఉక్రెయిన్‌కు గ్రనేడ్లను సరఫరా చేసే ఆయుధ ఫ్యాక్టరీ, సైనిక స్థావరానికీ ఇటువంటి పోస్టల్‌ ప్యాకేజీలు వచ్చాయి. మాద్రిద్‌లోని ఉక్రెయిన్‌ ఎంబసీలో ‘పోస్టల్‌ బాంబు’ పేలుడు సంభవించిన మరుసటి రోజే స్పెయిన్‌ సైనిక కేంద్రానికి ఇటువంటి పార్శిల్‌ రావడం గమనార్హం. అంతేకాకుండా రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఐదు పోస్టల్‌ బాంబులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది.

స్పెయిన్‌ (Spain) రాజధాని మాద్రిద్‌లో ఉన్న ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయానికి నవంబర్‌ 30న పోస్టల్‌లో ఓ బండిల్‌ వచ్చింది. అది తెరిచిన వెంటనే పేలుడు సంభవించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ ఎంబసీ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని ఉగ్రవాద చర్యగా పేర్కొన్న స్పెయిన్‌ ప్రభుత్వం.. ఉక్రెయిన్‌ ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. ఇటువంటి ప్యాకేజీ స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో శాన్‌షెజ్‌కు నవంబర్‌ 24న వచ్చింది. అయితే, అనుమానాస్పదంగా ఉండడంతో పరీక్షించిన బాంబు స్క్వాడ్‌ బృందాలు దాన్ని నిర్వీర్యం చేశాయి. వీటిపై దర్యాప్తు చేపడుతోన్న సమయంలో మరిన్ని పోస్టల్‌ బాంబులు వెలుగు చూస్తున్నాయి.

ఇలా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదు లెటర్‌ బాంబులు వెలుగు చూడగా.. అందులో నాలుగింటిని నిర్వీర్యం చేసినట్లు స్పెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. మరో బాక్సును నిపుణులు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ ఐదు ప్యాకేజీలు కూడా స్వదేశం నుంచే వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఘటనను ఖండిస్తున్నట్లు స్పెయిన్‌లోని (మాద్రిద్‌లోని) రష్యా ఎంబసీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సహాయాన్ని స్పెయిన్‌ అందిస్తోంది. స్పెయిన్‌ ఈశాన్య ప్రాంతమైన ఝరగోజాలో నగరంలో ఆయుధ ఫ్యాక్టరీ ఉంది. ఉక్రెయిన్‌కు పంపిస్తోన్న గ్రనేడ్‌లు ఇక్కడే తయారవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్‌ పేరుతోనే పార్శిల్‌ రావడం ఆందోళనకు గురిచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని