Shopping mall : రీల్స్‌ కోసం ఆ షాపింగ్‌ మాల్‌లోకి వెళ్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారు!

కొనే ఉద్దేశం లేకపోయినా కొందరు కాలక్షేపానికి షాపింగ్‌ మాల్స్‌కు వెళ్తుంటారు. అలాంటి వారు స్పెయిన్‌లోని (Spain) ఓ షాపింగ్‌ మాల్‌కు వెళితే మూల్యం చెల్లించుకోక తప్పదు.

Updated : 16 Jul 2023 19:21 IST

మాడ్రిడ్ : ఇప్పుడు ఎక్కడ చూసినా రీల్స్‌ (Reels) హవా నడుస్తోంది. ఇల్లు, ఆఫీసు ఇలా అన్నింటినీ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో (Social media) పోస్టు చేస్తున్నారు. కొందరు కొనేది, తినేది లేకపోయినా ప్రఖ్యాత రెస్టారెంట్‌లు, మాల్స్‌లో అడుగుపెట్టి అనవసర రద్దీ పెంచుతున్నారు. అలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు స్పెయిన్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ 5 యూరోల ప్రవేశ రుసుం బోర్డు పెట్టింది. దాంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కువియూస్‌ ముర్రియా.. స్పెయిన్‌ దేశం బార్సిలోనాలోని ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌. 1898 నుంచే ఇక్కడ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. శతాబ్దానికి పూర్వమే నిర్మించిన ఈ మాల్‌లో వింటేజ్‌ లుక్ ఉట్టిపడుతుంటుంది. ఇందులోని వస్తువులన్నీ స్పెయిన్‌ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకే పర్యాటకులతో ఎల్లవేళలా కిక్కిరిసిపోతుంటుంది. ఈ మాల్‌లో కొన్ని ప్రత్యేకమైన సాస్‌లు, మాంసం, చీజ్‌, నూనెలు దొరుకుతాయి. కానీ, వాటిని కొనకుండానే పర్యాటకులు వెళ్లిపోతుంటారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్స్‌ రీల్స్‌ చేసే వారి సంఖ్య పెరిగింది. దాంతో వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకొని బయటకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారికి చెక్‌ పెట్టాలని భావించిన యాజమాన్యం ప్రవేశ రుసుం పేరుతో బోర్డు పెట్టేసింది. ఏ వస్తువు కొనకుండా వెనుదిరిగితే 5 యూరోలు చెల్లించాలని ప్రవేశ ద్వారం వద్దే హెచ్చరిక ఏర్పాటు చేసింది. 

మా వద్ద కావాల్సినన్ని క్లస్టర్‌ బాంబులున్నాయి: పుతిన్‌

ప్రఖ్యాత మాల్ ఎదుట ఇలాంటి బోర్డు ఏర్పాటు చేశారని తెలియగానే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్యాటకులు ఈ మాల్‌లోకి అడుగుపెడుతున్నారు. కొందరైతే కిటికీల్లో నుంచే తమకు కావాల్సిన ఫుటేజీ తీసుకొని అక్కడ్నుంచి నిష్క్రమిస్తున్నారు. తాము తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ఫలిస్తోందని ఈ మాల్‌ మేనేజర్‌ టోనీ మెరినో తెలిపారు. అనవసర సందర్శకుల తాకిడి లేకపోవడంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉందని చెప్పారు. మొత్తానికి ఈ ఆలోచనను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘ఈ ప్లాన్‌ను అన్ని స్టోర్లలో అమలు చేస్తే పర్యాటకులందరి పర్సులు ఖాళీ అవుతాయని ’ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని