Ukraine Crisis: ఉక్రెయిన్‌ ప్రయత్నాలను తిప్పికొట్టాం: రష్యా

ఖేర్సన్‌ తూర్పు ఒడ్డుకు చేరుకునేందుకు ఉక్రెయిన్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని రష్యా తెలిపింది.

Published : 21 Nov 2023 21:12 IST

మాస్కో: ఆక్రమిత దక్షిణ ఖేర్సన్‌ (Kherson) ప్రాంతంలోని తూర్పు ఒడ్డుకు చేరుకునేందుకు ఉక్రెయిన్‌ సైన్యం (Ukraine Army) చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామని మంగళవారం రష్యా (Russia) వెల్లడించింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్‌ షొయిగు తెలిపారు. ఉక్రెయిన్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, కీవ్‌ భారీ నష్టాన్ని చవిచూసిందని అధికారులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సెర్గేయ్‌ పేర్కొన్నారు. అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు చర్యలు చేపట్టినందుకు రష్యా దళాలను ఆయన ప్రశంసించారు. అయితే, ఖేర్సన్‌లోని పరిస్థితులను సెర్గేయ్‌ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఉక్రెయిన్‌లోని బ్లాగర్లు పోస్టు చేస్తున్నారు. కీవ్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో రష్యా దళాలే వెనక్కి వెళ్లాయని అంటున్నారు.

మరోవైపు దక్షిణ ఖేర్సన్‌ తూర్పు భాగంలోని క్రైంకీ గ్రామంలో ఉక్రెయిన్‌ దళాలు స్థావరాలను ఏర్పాటు చేసినట్లు ఖేర్సన్‌లో రష్యా నియమించిన గవర్నర్‌ వ్లాదిమిర్‌ సాల్డో కూడా గతవారం అంగీకరించారు. గతేడాది నవంబర్‌లో మాస్కో దళాలు డ్నిప్రో నది పశ్చిమప్రాంతం నుంచి వెనుదిరిగినప్పటి నుంచి ఈ నది రెండు దేశాల బలగాలకు మధ్య సరిహద్దుగా మారింది. డ్నిప్రో నదీ తీరం నుంచి రష్యా దళాలను 8 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లగొట్టామంటూ గతవారం ఉక్రెయిన్ సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా సెర్గేయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు