Sudan: పారామిలిటరీ ఘాతుకం.. సూడాన్‌లో 100 మంది మృతి!

సూడాన్‌లోని ఓ గ్రామంపై ‘ర్యాపిడ్‌ సపోర్ట్‌ బలగాలు (RSF)’ జరిపిన దాడుల్లో దాదాపు 100 మంది మృతి చెందారు.

Published : 06 Jun 2024 23:59 IST

ఖార్తూమ్: ఆఫ్రికా దేశమైన సూడాన్‌ (Sudan) మరోసారి రక్తసిక్తమైంది. గెజిరా ప్రావిన్స్‌లోని వాద్‌ అల్‌-నౌరా గ్రామంపై పారామిలిటరీ ‘ర్యాపిడ్‌ సపోర్ట్‌ బలగాలు (RSF)’ జరిపిన దాడుల్లో.. దాదాపు 100 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని, అదేవిధంగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని తెలిపారు. భారీ ఆయుధాలతో గ్రామాన్ని ముట్టడించి, దాడులకు పాల్పడటంతోపాటు ఇళ్లను దోచుకున్నారని చెప్పారు. అయితే.. సూడాన్‌ ఆర్మీ తమపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తోందని, అందుకే సైన్యానికి చెందిన మూడు శిబిరాలపై దాడి చేసినట్లు ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది.

కల్లోలిత సూడాన్‌ నుంచి.. లక్ష మందికి పైగా వలస బాట!

దేశంపై పట్టు కోసం సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్‌ల మధ్య పోరుతో గత ఏడాది సూడాన్‌ అట్టుడికింది. 2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ ‘ఆర్‌ఎస్‌ఎఫ్‌’తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. ఈ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. రాజధాని ఖార్తూమ్‌ సహా పలు నగరాల్లో సాయుధ వాహనాలతో కాల్పుల మోత మోగింది. చివరకు విమానాశ్రయాలూ రణక్షేత్రాలుగా మారాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో దాదాపు 14 వేల మందికి పైగా మరణించారు. లక్షలాది మంది నిర్వాసితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని