Moscow: మాస్కో ఉగ్రదాడి.. నేరాన్ని అంగీకరించిన ముష్కరులు!

Moscow: మాస్కోలో సంగీత కచేరీపై విరుచుకుపడిన ఘటనలో నలుగురు ముష్కరులు పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించారు.

Updated : 25 Mar 2024 09:49 IST

మాస్కో: మాస్కో ఉగ్రదాడిలో (Moscow concert attack) పోలీసులకు చిక్కిన నలుగురు ముష్కరుల్లో ముగ్గురు నేరాన్ని అంగీకరించారు. సంగీత కచేరీపై తుపాకులు, బాంబులతో విరుచుకుపడిన వారిలో తామూ ఉన్నామని ఆదివారం కోర్టు ముందు వెల్లడించారు. దీంతో తజకిస్థాన్‌కు చెందిన ఈ నలుగురినీ మే 22 వరకు కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. 

ఉగ్రవాద చర్యల కింద పోలీసులు మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలోనే ఈ నలుగురు ఉన్నారు. వీరు అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్-ఖొరాసన్‌ ఉగ్రముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ముగ్గురు నేరాన్ని అంగీకరించగా.. మరొకర్ని అసలు మాట్లాడలేని స్థితిలో కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ సాంతం అతడు వీల్‌ఛైర్‌లో కళ్లు మూసుకొని ఉన్నాడు. మిగిలిన ముగ్గురూ తీవ్ర గాయాలతో కనిపించారు. దర్యాప్తు సమయంలో వారిపై అక్కడి బలగాలు చేయి చేసుకొని ఉంటాయని రష్యన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంట్లో వాస్తమెంత అనేది ధ్రువీకరణ కాలేదు.

ఈ నలుగురు నిందితులను రష్యా-బెలారస్‌ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో బంధించి విచారించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. డబ్బు కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని నిందితుల్లో ఒకరు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. దాదాపు 5,425 డాలర్లు ఆఫర్‌ చేసినట్లు వెల్లడించింది. దీంట్లో సగం మొత్తం ఇప్పటికే వారికి అందినట్లు తెలిపింది. మరోవైపు రష్యా (Russia) టెలిగ్రాం ఛానళ్లలోనూ అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ నిందితుడు చెవిపై తీవ్ర గాయంతో అడవి నుంచి బయటకు వస్తున్నట్లు వీడియోల్లో కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇంకో వీడియోలో అదే వ్యక్తి మోకాళ్లపై కూర్చొని దర్యాప్తు అధికారులకు సమాధానం ఇస్తున్నట్లు ఉందని తెలిపింది. మరోవైపు మార్చి 23న క్రాకస్‌ హాల్‌లో జరిగిన దాడికి సంబంధించినదిగా భావిస్తున్న ఓ వీడియోను ఇస్లామిక్‌ స్టేట్‌ శనివారం విడుదల చేసింది. ముష్కరుల్లో ఒకడిగా భావిస్తున్న వ్యక్తి ఫొటోను కూడా బహిర్గతం చేసింది.

మరోవైపు ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. శుక్రవారం నాటి ఘటనతో తమకేమాత్రం ప్రమేయం లేదని ఉక్రెయిన్‌ తోసిపుచ్చిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అఫ్గాన్‌కు చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ఈ కాల్పులకు తామే తెగబడినట్లు చెప్పినా.. పుతిన్‌ మాత్రం ఈ పేరు ప్రస్తావించలేదు. కాల్పుల ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిని రక్తపాత, అనాగరిక ఉగ్రచర్యగా అభివర్ణించారు. అనుమానితులు నలుగురూ ఉక్రెయిన్‌ వైపు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించగా తమ బలగాలు పట్టుకున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని