Earthquake: భారీ భూకంపం.. ఊగిపోయిన ఫ్లైఓవర్‌

Earthquake: తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం దాటికి పలు వంతెనలు, ఫ్లైఓవర్లు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Updated : 03 Apr 2024 12:23 IST

తైపీ: తైవాన్‌ (Taiwan) ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. ఈ ఉదయం చోటుచేసుకున్న ఈ విపత్తు కారణంగా పలు భవనాలు నేలకూలాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్‌, వంతెనలే ఊగిపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

విపత్తు సంభవించిన సమయంలో తైపీ నగరంలోని ఓ ఫ్లైఓవర్‌ కొన్ని నిమిషాల పాటు కదిలింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు. మరో చోట మెట్రో బ్రిడ్జి ఊగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తైవాన్‌ వ్యాప్తంగా భూకంప ప్రభావం కన్పించింది.

తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. అటు జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని పలు దీవుల్లోనూ ప్రకంపనలు కన్పించాయి. భూకంపం కారణంగా తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఈ ముప్పు తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది. 

తైవాన్‌లో 25కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో నలుగురు మృతిచెందగా.. 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. భూకంప తీవ్రత నేపథ్యంలో తైవాన్‌ వ్యాప్తంగా రైలు సేవలను నిలిపివేశారు. తైపీలో సబ్‌వే సేవలను రద్దు చేశారు. విమానాల రాకపోకలకూ అంతరాయం కలిగింది. గత పాతికేళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని అధికారులు చెబుతున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు