Pakistan: పొరుగు దేశంపై పాక్‌ వైమానిక దాడి.. ఎనిమిది మంది మృతి

తమ దేశంలోని వజీరిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్థాన్‌ ప్రతీకారం తీర్చుకొంది. అఫ్గానిస్థాన్‌లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. 

Published : 18 Mar 2024 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్ర వాదులకు ఆశ్రయం ఇస్తోందనే సాకుతో పాకిస్థాన్‌ (Pakistan) సోమవారం అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు చేసింది. మొత్తం రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యను అఫ్గానిస్థాన్‌ ప్రతినిధి ఖండించారు. ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. ‘‘ఇస్లామిక్‌ ఎమరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ సార్వభౌమత్వం విషయంలో ఏమాత్రం రాజీ పడదు. పాకిస్థాన్‌ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయలేక మమ్మల్ని నిందించడం తగదు. అక్కడి ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొంది. ఇలాంటి చర్యలకు (వైమానిక దాడుల వంటి) తీవ్ర పరిణామాలు ఉంటాయి. వాటిని అదుపుచేయడం పాక్‌ వల్ల కాదు’’ అని జబియుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. 

తూర్పు ప్రావిన్స్‌లోని ఖోస్ట్‌, పాక్టికలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాకిస్థాన్‌ విమానాలు దాడులు నిర్వహించాయి. ఇప్పటికే పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. వీటిపై పాక్‌ విదేశాంగశాఖ నోరు మెదపలేదు. 

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వీరి అంత్యక్రియల సందర్భంగా పాక్‌ అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్దారీ స్పందిస్తూ కచ్చితంగా తమ వీరుల త్యాగాలు వృథాగా పోవని ప్రతిజ్ఞ చేశారు. టీటీపీ ఉగ్రవాదులే ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను అఫ్గాన్‌ భూభాగం కేంద్రంగా నడిపిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని