Lukashenko: ‘మేం సరిగా డీల్‌ చేయలేకపోయాం’: వాగ్నర్ తిరుగుబాటు నేపథ్యంలో లుకషెంకో వ్యాఖ్యలు

తిరుగుబాటు అనంతరం వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్( Yevgeny Prigozhin) తాజాగా బెలారస్‌(Belarus)లో ల్యాండ్ అయ్యారని సమాచారం. మరోపక్క బెలారస్ అధ్యక్షుడు ఈ తిరుగుబాటు గురించి స్పందించారు.

Published : 27 Jun 2023 17:10 IST

మిన్స్క్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై దండయాత్రలో రష్యా(Russia) సైన్యానికి అండగా నిలిచిన వాగ్నర్‌ కిరాయి సేనలు(Wagner Group) ఒక్కసారిగా తిరుగుబాటు చేయడం పుతిన్‌(Putin) ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. రష్యా పొరుగుదేశం బెలారస్‌(Belarus) మధ్యవర్తిత్వంతో ఆ తిరుగుబాటును వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్‌( Yevgeny Prigozhin) మధ్యలోనే నిలిపివేశారు. శనివారం నుంచి ఆయన జాడపై స్పష్టత లేనప్పటికీ.. ప్రస్తుతం బెలారస్‌ రాజధాని మిన్స్క్‌ సమీపంలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ తిరుగుబాటుపై బెలారస్‌(Belarus) అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పందించారు. రష్యా సైన్యం, వాగ్నర్ ముఠా మధ్య తలెత్తిన అసంతృప్తిని సరిగా డీల్‌ చేయలేకపోయామని వెల్లడించారు.

‘మేం ఈ పరిస్థితిని ఊహించలేకపోయాం. సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు వాటంతట అవే సమసిపోతాయని భావించాం. కానీ అలా జరగలేదు. అయితే మొత్తంగా  ఇక్కడ హీరోలు ఎవరూ లేరు. అందరూ ఒకటే’ అని లుకషెంకో వెల్లడించినట్లుగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ప్రిగోజిన్ మంగళవారం బెలారస్‌(Belarus) చేరుకున్నట్లు సమాచారం. ఫ్లైట్ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ఒకటి ఈ మేరకు అంచనా వేసింది.  మరోపక్క రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌.. ప్రిగోజిన్‌పై నమోదైన కేసుని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఇది కూడా లుకషెంకో(Alexander Lukashenko) మధ్యవర్తిత్వం ఫలితమే.

ఇదిలా ఉంటే.. వాగ్నర్ గ్రూప్ ప్రవేశించిన తర్వాత రష్యా సైన్యం కీలక విజయాలు సాధించింది. అయితే వాటి ఘనత ఎవరికి దక్కాలనే దానిపై ఈ రెండింటి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తమ సైనికులకు ఆయుధాలు సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోందని, అందుకు రక్షణ మంత్రి సెర్గీ షొయిగునే కారణమని ప్రిగోజిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే దేశం కోసం పోరాడుతున్న తమను అంతమొందించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విభేదాలు ముదిరి.. తిరుగుబాటుకు దారితీశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని