Pakistan: ఉగ్రవాదం పాక్‌ అతిపెద్ద సమస్య : ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు.

Published : 17 Nov 2022 18:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. ఖైబర్‌ పఖ్తూన్‌క్వాలో గస్తీ వ్యాన్‌పై దాడిని ఆయన ఖండించారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఎటువంటి తప్పు చేయవద్దు. దేశ ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి. మన పోలీసులు, సాయుధ బలగాలు ఉగ్రవాదంపై ధైర్యంగా పోరాడారు. గస్తీ వ్యాన్‌పై దాడిని ఖండించడానికి మాటలు రావడంలేదు. బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.  

ఖైబర్‌ ప్రావిన్స్‌లోని లక్కీ మర్వాట్‌ ప్రాంతంలో కొందరు ఆటోమేటిక్‌ ఆయుధాలతో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంపై బుధవారం దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు చనిపోయారు. తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకొంది. ఈ దాడిని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. మాతృభూమి కోసం ఆ పోలీసులు ప్రాణత్యాగం చేశారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ ఉగ్రవాదులను పాకిస్థాన్‌ శత్రువులుగా అభివర్ణించారు. ప్రజలు వారికి వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. గత వారం కూడా దక్షిణ వజీరిస్థాన్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని