Elon Musk: నాడు మిత్రుడి భార్యతో ఎలాన్‌ మస్క్‌ అఫైర్‌ నిజమే.. అమెరికాలో సంచలన కథనం

Elon Musk: గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్యతో ఎలాన్‌ మస్క్‌ గతంలో అఫైర్‌ సాగించడం నిజమేనంటూ అమెరికాలో సంచనల కథనం వెలువడింది.

Published : 25 May 2024 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ (Google co-founder Sergey Brin) భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం (Affair) సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది.

2021లో నికోల్ (Nicole Shanahan) న్యూయార్క్‌లో తన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటుచేశారు. ఆ పార్టీకి సెర్గీ స్నేహితుడైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ బంధం మొదలైనట్లు సదరు కథనం పేర్కొంది. అదే ఏడాది డిసెంబరులో మియామీలో మస్క్‌ సోదరుడు ఇచ్చిన విందులో నికోల్‌ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ కెటమిన్‌ డ్రగ్స్‌ తీసుకున్నారని, కొన్ని గంటల పాటు కన్పించకుండా పోయారని  ఆ పార్టీకి వచ్చిన నలుగురు ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

మస్క్‌తో తాను శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్లు నికోల్‌ తన భర్త సెర్గీ బ్రిన్‌, ఇతర కుటుంబసభ్యుల ముందు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ముగ్గురు విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ పార్టీ జరిగిన రెండు వారాల తర్వాత నుంచి విడివిడిగా ఉన్న సెర్గీ, నికోల్‌ 2022లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 18 నెలల తర్వాత గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నికోల్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌కు రన్నింగ్‌ మేట్‌గా పోటీ చేస్తున్నారు.

రెండేళ్ల కిందటే మస్క్‌, నికోల్ అఫైర్‌ వార్తలు బయటకు రాగా.. వీరిద్దరూ కొట్టిపారేశారు. ఆమెతో తనకు ఎలాంటి బంధం లేదని మస్క్‌ అప్పట్లో ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఈ వ్యవహారం కారణంగా మస్క్‌, సెర్గీ స్నేహబంధం కూడా ముగిసినట్లు వార్తలు వచ్చాయి. మస్క్‌, సెర్గీ ఒకప్పుడు మంచి మిత్రులు. టెస్లా సంస్థ తయారుచేసిన తొలి కార్లను అందుకున్నవారిలో సెర్గీ కూడా ఒకరు. అంతేగాక, 2008లో మాంద్యం సమయంలో టెస్లా కార్యకలాపాలు కొనసాగించేందుకు సెర్గీ 5 లక్షల డాలర్లు సాయం చేశారు. మస్క్‌కు చెందిన కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులు కూడా ఉండేవి. అయితే, ఈ వ్యవహారంతో వాటిని ఉప సంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని