Israel-Hamas war: గాజాలో ఆస్తి నష్టం 18.5 బిలియన్‌ డాలర్లు.. నివేదిక విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు

గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ యద్ధం నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రపంచబ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది. 

Updated : 03 Apr 2024 05:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం (Israel-Hamas war) కారణంగా గాజాలో సుమారు 18.5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు (World Bank) పేర్కొంది. 2022లో వెస్ట్‌బ్యాంక్‌ (West bank), గాజా (Gaza) ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తిలో ఇది 97 శాతానికి సమానమని వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌ 7 నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి గాజాలో ఆస్తినష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను ప్రపంచబ్యాంకు విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి (UN), యూరోపియన్‌ యూనియన్‌ల సహకారంతో తయారు చేసిన ఈ రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థిక రంగంలోని ప్రతి వ్యవస్థకు భారీ నష్టం చేకూరినట్లు తెలిపింది. పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసం కావడం ద్వారానే 70 శాతం నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొంది.

ఇంత భారీ నష్టంతో ఇజ్రాయెల్‌ దళాల దాడులకు గాజా స్ట్రిప్‌లో ఉన్న ప్రజలు చెల్లాచెదురయ్యారు. జనాభాలో సగానికి మించి తీవ్ర కరవు అంచున ఉన్నట్లు, ఆహార అభద్రత, పోషకాహార లోపాన్ని అక్కడి ప్రజలంతా ఎదుర్కొంటున్నట్లు తేలింది. దాడులు, పోరాటం ఫలితంగా మూడోంతుల ప్రజలు తమ ప్రాంతాలను వీడారు. 10 లక్షలకు పైగా జనాభా ఇళ్లు లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. నీటి, పారిశుద్ధ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలాయి. 100 శాతం మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారు. 92 శాతం రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో పేర్కొంది.

గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మారణకాండ సృష్టించడంతో సుమారు 1200 మంది మృతి చెందారు. 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకుంది. దీంతో ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. హమాస్‌ అగ్రనేతలే లక్ష్యంగా సొరంగాల ధ్వంసంతో పాటు వైమానిక, భూతల దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో హమాస్‌ అగ్రశ్రేణి కమాండర్లు పలువురు హతమయ్యారు. గాజాను పరిపాలిస్తున్న హమాస్‌ ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 32,916 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆసుపత్రులు, పాఠశాలల కింద మిలిటెంట్లు సొరంగాలను నిర్మించుకోవడంతో ఐడీఎఫ్‌ బలగాలు భారీ ఎత్తున వాటిని ధ్వంసం చేశాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల ఫలితంగా ఇప్పటి 26 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు పోగైనట్లు అంచనా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు