Turkey: నెతన్యాహుకి.. హిట్లర్‌కి తేడా లేదు: తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌

నెతన్యాహుకి, హిట్లర్‌కి మధ్య తేడా లేదని, నిజానికి హిట్లర్‌ కంటే నెతన్యాహునే గొప్పవాడని తుర్కియే (Turkey)అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అన్నారు.

Published : 28 Dec 2023 01:03 IST

అంకారా: ఇజ్రాయెల్‌ (Isreal) ప్రధాన మంత్రి నెతన్యాహు (Netanyahu)కి, జర్మనీ నియంత హిట్లర్‌ (Hitler)కి తేడా లేదని తుర్కియే (Turkey) అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అన్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నెతన్యాహు తీరుపై మండిపడ్డారు. 

‘‘నెతన్యాహుకి, హిట్లర్‌కి మధ్య తేడా లేదు. నిజానికి హిట్లర్‌ కంటే నెతన్యాహునే గొప్పవాడు. ఎందుకంటే అతడికి అమెరికా, పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది’’అని ఎర్డోగాన్‌ అన్నారు. ఇజ్రాయెల్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన ఆయన.. గాజా పట్ల నెతన్యాహు కసాయిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు.. హమాస్‌ను స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సంస్థ అని ప్రశంసించారు. 

తుర్కియే అధ్యక్షుడి వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. ‘‘కుర్దులపై మారణహోమం సృష్టిస్తూ.. తనను విమర్శించే జర్నలిస్టులకు జైలు శిక్ష విధించడంలో ప్రపంచ రికార్డు కలిగిన ఎర్డోగానే మనకు నైతికతను బోధించే చివరి వ్యక్తి అవుతాడు’’అని ఎద్దేవా చేశారు. హమాస్‌పై ప్రశంసలు గుప్పిస్తోన్న ఎర్డోగాన్‌.. ఆ సంస్థ నాయకులకు ఆతిథ్యమిస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం పోరాడుతోందని తెలిపారు.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ గ్రూప్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హమాస్‌ మిలిటెంట్లు 1,140 ఇజ్రాయెలీ ప్రజలను విచక్షణ రహితంగా కాల్చి చంపేశారు. 250 మందిని బందీలుగా చేసుకున్నారు. మరుసటి రోజు నుంచే ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతీకారంతో హమాస్‌ స్థావరాలున్న గాజాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ దాడిలో ఇప్పటి వరకు గాజాలో 21,110 మంది మృతి చెందారని, 55వేలకు పైగా ప్రజలు గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని