ఐఫోన్‌ అనుకుని దొంగిలించి.. ఆండ్రాయిడ్‌ అని తెలిసి ఏం చేశారంటే?

ఒకసారి ఫోన్ పోగొట్టుకున్నామంటే.. తిరిగి అది మన చేతికి రావడం కలే. కానీ, ఓ వ్యక్తి నుంచి కొట్టేసిన ఫోన్‌ను దొంగలు వెంటనే తిరిగి ఇచ్చేశారు. 

Published : 05 Dec 2023 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ దొంగతనాలు పెరిగిపోయాయి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో చోరులు తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అయితే.. ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి వారి నుంచి ఫోన్‌, నగదు వంటివి లాక్కుని పారిపోతుంటారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి.. దొంగలను పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకుంటే మినహా.. అవి మన చేతికి రావు. అయితే, కొట్టేసిన వస్తువులను తిరిగి ఇవ్వడం చాలా అరుదు. కానీ, ఓ దొంగ ఐఫోన్‌ అనుకుని దొంగిలించి.. తీరా అది ఆండ్రాయిడ్ ఫోన్ అని తెలిసి దాన్ని బాధితులకు తిరిగి ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళితే.. 

అమెరికాలోని వాషింగ్టన్‌లో నివసించే ఓ వ్యక్తి తన కారును అపార్ట్‌మెంట్ బయట పార్క్ చేసి లోపలికి వస్తున్నాడు. అంతలో ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు అతన్ని అడ్డగించి తుపాకితో బెదిరించారు. తర్వాత అతని వద్ద ఉన్న నగదు, కారు తాళాలు, ఫోను లాక్కుని అక్కణ్నుంచి వెళ్లిపోయారు. వారిలో ఓ దొంగ వెనక్కి వచ్చి.. ఫోన్‌ తిరిగి ఇచ్చేస్తూ.. ‘ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌.. ఐఫోన్ అనుకున్నాం’ అని చెప్పి వెళ్లిపోయాడని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన తర్వాత తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ మేం ఎంతో కష్టపడి కూడబెట్టిన నగదు మొత్తం దొంగలు దోచుకున్నారు. మా జీవితం తలకిందులైంది’’ అని వాపోయారు. ఇటీవలి కాలంలో వాషింగ్టన్‌లో ఈ తరహా నేరాలు 70 శాతం మేర పెరిగాయని పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని