Donald Trump: ట్రంప్‌నకు మద్దతుగా వివేక్‌ రామస్వామి..!

ట్రంప్‌నకు మద్దతుగా ఇండో-అమెరికన్‌ నేత వివేక్‌ రామస్వామి గళం విప్పారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఉద్దేశాలపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయం బెడిసి కొడుతుందని హెచ్చరించారు.

Published : 31 May 2024 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతుగా ఇండో-అమెరికన్‌ నేత వివేక్‌ రామస్వామి గళం విప్పారు. ట్రంప్‌ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీసుకొన్న నిర్ణయం కచ్చితంగా బెడిసి కొడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన  సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘‘ప్రాసిక్యూటర్‌ ఓ రాజకీయ నాయకుడు. అతడు ట్రంప్‌ను దెబ్బతీస్తానని వాగ్దానం చేశాడు. ఇక జడ్జి గారి కూమార్తె డెమొక్రటిక్‌ పార్టీ ఆపరేటివ్‌. ఆమె తండ్రి అధ్యక్షతన గతంలో ఆ పార్టీ కోసం నిధులను సేకరించింది. దీనికి తోడు శిక్షవిధించే సమయంలో నిందితుడి నేరాంగీకారంతో పనిలేదని జ్యూరీ పేర్కొంది. ఇవన్నీ బెడిసి కొడతాయి’’ అని రామస్వామి తన పోస్టులో పేర్కొన్నారు.

ఇండో అమెరికన్‌ రాజకీయ వేత్త, లుసియానా మాజీ గవర్నర్‌ బాబీ జిందల్‌ కూడా దీనిపై స్పందించారు. ‘‘తొలుత శిక్షను ప్రకటించి.. ఆ తర్వాత విచారణ చేపట్టి డెమొక్రాట్లు చాలా సమయాన్ని ఆదా చేశారు’’ అని వెటకారంగా పేర్కొన్నారు.

ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ స్పందిస్తూ ‘‘అమెరికా చరిత్రలో ఇది సిగ్గుపడాల్సిన రోజు. ఈ నిర్ణయం వెలువరించేందుకు రాజకీయ కసరత్తు చేశారే గానీ.. న్యాయపరమైన సంసిద్ధత లేదు’’ అని వ్యాఖ్యానించారు.

లవ్‌యూ డాడీ..: ఇవాంక భావోద్వేగ పోస్టు

డొనాల్డ్‌ ట్రంప్‌ను కోర్టు నిందితుడిగా తేల్చిన కొద్దిసేపటికే ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌ నుంచి స్పందన వచ్చింది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనికి ‘ఐ లవ్‌యూ డాడీ’ అనే  క్యాప్షన్‌, హార్ట్‌ ఎమోజనీ జత చేశారు.  

ట్రంప్‌నకు శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధరించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్ష రేసుపై కొంత సస్పెన్స్‌ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని