TikTok: మా పిల్లలు టిక్‌టాక్‌ వాడరు.. ఆ కంపెనీ సీఈవో ఆసక్తికర సమాధానం..!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టిక్‌టాక్‌(TikTok) ఎదుర్కొంటోన్న నిషేధం, దానిపై ఉన్న ఆందోళనల గురించి ఆ సంస్థ సీఈఓను యూఎస్‌ కాంగ్రెస్ ప్రశ్నించింది. 

Updated : 24 Mar 2023 16:21 IST

వాషింగ్టన్‌: ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌(TikTok) ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థ సీఈఓ షో జి చ్యూ(Shou Zi Chew) యూఎస్‌ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీ పిల్లలు టిక్‌టాక్‌ వాడుతున్నారా..?’ అని కాంగ్రెస్ సభ్యులు ఆయన్ని ప్రశ్నించారు.  

‘టిక్‌టాక్‌ కార్యకలాపాలు మొత్తం దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌ నుంచే సాగుతాయి. చైనా(China) కేంద్రంగా బైట్‌డ్యాన్స్  పనిచేస్తోంది. టిక్‌టాక్ యాప్‌ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదు. అలాగే 150 మిలియన్ల అమెరికన్‌ యూజర్ల డేటాకు ఇది ఎలాంటి ప్రమాదం కలిగించదు’ అంటూ తన సంస్థ విధానాలను చ్యూ(Shou Zi Chew) పునరుద్ఘాటించారు. 

ఇదిలా ఉంటే భారత్‌ సహా  ఇతర దేశాల్లో టిక్‌టాక్‌(TikTok)పై ఉన్న నిషేధం గురించి చట్టసభ్యుల్లో ఒకరు ప్రశ్నించారు. ‘ఈ యాప్‌ చైనా ప్రభుత్వం పరిధిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో భద్రతాపరమైన ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇవి తప్పని మీరు ఎలా చెప్పగలరు..?’ అని ఆ సభ్యుడు అడిగారు. ‘ఈ ఆరోపణలన్నీ ఊహాజనితమైనవి. వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు మాకు కనిపించలేదు’ అని సీఈఓ సమాధానం ఇచ్చారు.

అయితే భారతదేశం విధించిన నిషేధం పై కాంగ్రెస్‌ సభ్యుడు మరోసారి ప్రస్తావించారు. ‘టిక్‌టాక్‌(TikTok)ను భారత్ 2020లో నిషేధించింది. మార్చి 21న వెలువడిన ఫోర్బ్స్‌(Forbes) కథనం.. భారత యూజర్ల డేటా ఉద్యోగులకు, సంస్థకు ఏ విధంగా అందుబాటులో ఉందో వెల్లడించింది’ అంటూ ఆ కథనం గురించి ప్రశ్నించారు. అందుకు సీఈఓ సమాధానం ఇస్తూ.. ‘ఇది తాజా కథనం. దీని గురించి పరిశీలించమని మా సిబ్బందికి సూచించాను. మా వద్ద కఠినమైన డేటా యాక్సెస్  విధానాలు ఉన్నాయి. ఇలాంటి కథనాలతో మేం ఏకీభవించం’ అని వివరించారు. 

మీ పిల్లలు టిక్‌టాక్‌ వాడతారా..?

తన పిల్లలు టిక్‌టాక్(TikTok) ఉపయోగించరంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చ్యూ(Shou Zi Chew) వెల్లడించారు. ‘వారు సింగపూర్‌లో ఉంటారు. ఆ దేశంలో 13 ఏళ్లలోపు పిల్లలకు.. టిక్‌టాక్‌ చైల్డ్‌ వెర్షన్ అందుబాటులో లేదు. ఈ వెర్షన్ అమెరికాలో అందుబాటులో ఉంది. నా పిల్లలు అమెరికాలో ఉంటే వారు ఆ యాప్‌ను వాడేందుకు అంగీకరిస్తాను’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని