Shamima Begum: ‘అన్నీ తెలిసే సిరియాకు..!’ ‘ఐసిస్‌ పెళ్లికూతురి’కి మరోసారి చుక్కెదురు

బ్రిటన్‌ పౌరసత్వం పునరుద్ధరణ కేసులో షమీమా బేగంకు మరోసారి చుక్కెదురైంది. ఉగ్ర సంస్థలో చేరేందుకు ఆమె 2015లో బ్రిటన్‌ నుంచి సిరియాకు పారిపోయారు.

Published : 24 Feb 2024 02:03 IST

లండన్‌: తన బ్రిటన్‌ పౌరసత్వాన్ని తిరిగి పొందేందుకు చేస్తున్న న్యాయపోరాటంలో ‘ఐసిస్‌ పెళ్లికూతురు’ షమీమా బేగం (Shamima Begum)కు మరోసారి చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో బ్రిటన్‌ (Britain)లోని ‘స్పెషల్‌ ఇమిగ్రేషన్‌ అప్పీల్స్‌ కమిషన్‌ (SIAC)’ గతంలో ఇచ్చిన తీర్పుతో అప్పీల్‌ కోర్టు తాజాగా ఏకభవించింది. ‘‘ఆమెను ఇతరులు ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ, సిరియాకు వెళ్లి ఉగ్ర సంస్థతో జట్టు కట్టే విషయంలో అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపింది. 24 ఏళ్ల షమీమా ప్రస్తుతం ఉత్తర సిరియాలోని శరణార్థి శిబిరంలో నివసిస్తున్నారు.

బంగ్లాదేశ్‌ మూలాలున్న షమీమా బేగం 15 ఏళ్ల వయసులో.. 2015 ఫిబ్రవరిలో ‘ఐసిస్‌’లో చేరేందుకు సిరియా వెళ్లిపోయింది. ఆమె తూర్పు లండన్‌లోని బెథ్నల్‌ గ్రీన్‌ పాఠశాలలో చదువుతుండేది. మరో ఇద్దరు విద్యార్థినులు కూడా ఆమెతో పాటే వెళ్లారు. అక్కడే డచ్‌కు చెందిన ఐసిస్‌ ఉగ్రవాది యగో రీడ్జిక్‌ను వివాహం చేసుకుంది. దాంతో షమీమాను ‘ఐసిస్‌ పెళ్లికూతురు’ అని వ్యవహరించేవారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టినా.. వారంతా చనిపోయారు. 2019 ఫిబ్రవరిలో సిరియా శరణార్థుల శిబిరంలో కనిపించడంతో.. బ్రిటన్‌ హోంశాఖ  ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసింది.

నావల్నీ కుటుంబాన్ని పరామర్శించిన బైడెన్‌

దీనిని సవాలు చేస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే.. తిరిగి రావడానికి ఆమెకు అవకాశం కల్పించకూడదంటూ 2021లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జాతీయ భద్రత ముందు ఏదీ ప్రధానం కాదని, ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది. 2022లో ‘సుప్రీం’ తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకుంది. దీంతో ‘ఎస్‌ఐఏసీ’ని ఆశ్రయించి.. ‘మానవ అక్రమ రవాణా’ బాధితురాలిగా చెప్పుకొంది. అయితే.. పౌరసత్వం రద్దుకు హోంశాఖ ఈ విషయాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని కమిషన్‌ తీర్పు చెప్పింది. దీన్ని సవాల్‌ చేయగా మరోసారి వ్యతిరేక తీర్పు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని