Donald Trump: ట్రంప్‌నకు జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ మద్దతు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్‌నకు జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. 

Updated : 19 May 2024 10:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో అతిశక్తిమంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) మద్దతు రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌న(Donald Trump)కు లభించింది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఆయన టెక్సాస్‌లో వేల మంది ఎన్‌ఆర్‌ఏ సభ్యులను ఉద్దేశించి శనివారం ప్రసంగించారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ సంస్థ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించింది. 

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఓటు వేసి వచ్చే నాలుగేళ్లలో వారి తుపాకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్కోనేందుకు బైడెన్‌ గత 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని రెండో సవరణను సంరక్షిస్తానని చెప్పారు. తుపాకీ యజమానులకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుడు తానేనని అభివర్ణించుకొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీని రాడికల్‌ లెఫ్ట్‌ అని విమర్శించారు. ఒకప్పుడు ఆయన ఎన్‌ఆర్‌ఏను ఉగ్ర సంస్థతో పోల్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌ఆర్‌ఏ సమావేశానికి ట్రంప్‌ హాజరై.. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. మీ తుపాకులపై ఎవరూ వేలు కూడా పెట్టలేరంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీలో ఎన్‌ఆర్‌ఏ సభ్యులు ఎక్కువమందే ఉన్నారు. 

ఏమిటీ రెండో సవరణ.. 

‘‘అమెరికా స్వతంత్ర రాజ్య రక్షణ కోసం సైన్యానికి తోడుగా సాయుధ పౌరులతో ఏర్పడిన దళం (మిలీషియా) అవసరం. తదనుగుణంగా వ్యక్తులకు ఆయుధాలను ధరించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించకూడదు’’ అని నిర్దేశిస్తూ 1791లో అమెరికా రాజ్యాంగానికి రెండవ సవరణ తెచ్చారు. పౌరులు ఆయుధాలు కలిగి ఉండడానికి దీనిని ముడిపెడుతూ వక్రభాష్యం చెబుతున్నారనీ, నిజానికి ఈ సవరణలో పేర్కొన్న మిలీషియా అనే పదం నేషనల్‌ గార్డ్స్‌ వంటి జాతీయ భద్రతా దళాలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన ఉంది. అందరూ తుపాకులు కొనడం వల్లనే కాల్పులు పెరిగిపోతున్నాయనీ, ఈ ధోరణిని నిరోధించాలని పౌర హక్కుల సంఘాలు ఎప్పటికప్పుడు డిమాండ్‌ చేస్తున్నాయి. తుపాకులను నిషేధించకుండా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) తదితర గ్రూపులు పైరవీలు చేస్తున్నాయి. దీనికి తుపాకీ ఉత్పత్తిదారుల నుంచే కాకుండా, ఆయుధధారులైన అమెరికన్‌ పౌరుల నుంచీ విరాళాలు వస్తుంటాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని