Donald Trump: మస్క్‌తో స్నేహానికి బీటలు.. టెస్లా కారుపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By International News Team Updated : 10 Jun 2025 14:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ల మధ్య బంధం ఇటీవల బీటలువారిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మస్క్‌కు చెందిన టెస్లా (Tesla) నుంచి కొనుగోలు చేసిన కారును ట్రంప్‌ దూరం పెడతారనే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ట్రంప్‌ (Donald Trump) స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

మస్క్‌ (Elon Musk)కు చెందిన టెస్లా కంపెనీ నుంచి ట్రంప్ ఇటీవల ఓ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మస్క్‌, ట్రంప్‌ల మధ్య వివాదం సమయంలో ఆ కారు వైట్‌హౌస్‌ వద్ద ఉంది. దీంతో ట్రంప్‌ ఆ కారును వదులుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. సోమవారం విలేకరుల సమావేశంలో ఓ విలేకరి దీనిపై ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను అందులో చక్కర్లు కొడతా’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా వైట్‌హౌస్‌లో స్టార్‌లింక్‌ సేవలను నిలిపివేసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టంచేశారు. అది మంచి సేవలను అందిస్తుందని కొనియాడారు. 

ఇక, మస్క్‌తో మాట్లాడాలనుకుంటున్నారా? అని మరో విలేకరి ప్రశ్నించగా.. ‘నేను అతడి స్థానంలో ఉంటే.. మాట్లాడాలనే అనుకునేవాడిని. అతడు అదే అనుకుని ఉండవచ్చు. ఈ విషయం అతడినే అడగాలి. మా మధ్య మంచి సంబంధం ఉంది. అతనికి అభినందనలు తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు. కాగా.. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి మస్క్‌ హార్ట్‌ ఎమోజీతో రియాక్టయ్యారు. ఇదిలాఉండగా.. టెస్లా అధినేత వైట్‌హౌస్‌లో డ్రగ్స్ వినియోగించారా అనే ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ.. తనకు దాని గురించి కచ్చితంగా తెలియదన్నారు. అయితే మస్క్‌ అలా చేసి ఉండరనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.

ట్రంప్‌ ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ను మస్క్‌ వ్యతిరేకించిన నేపథ్యంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత వీరిద్దరూ బహిరంగంగానే పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయానికి తానే కారణమని మస్క్‌ చేసిన వ్యాఖ్యలను ట్రంప్‌ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని, డోజ్‌ నుంచి తప్పించినందుకే మస్క్‌కు అంత ఆక్రోశమని విమర్శించారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌ కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ కేసు దర్యాప్తు పత్రాలు బయటపెట్టడం లేదని టెస్లా అధినేత ఆరోపించారు. ఈ క్రమంలోనే మస్క్‌ కొత్త పార్టీ చర్చ కూడా జరిగింది.  

Tags :
Published : 10 Jun 2025 13:26 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని