US Secrets: ఉక్రెయిన్‌ యుద్ధం రహస్యాలు లీక్‌..! అందులో ఏమున్నాయ్‌..?

ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి కొన్ని రహస్య పత్రాలు సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అవడం ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. అమెరికా రక్షణశాఖ విభాగం రూపొందించిన ఈ పత్రాలు ఎవరు లీక్‌ చేశారన్న దానిపై అమెరికా దర్యాప్తు జరుపుతోంది.

Updated : 13 Apr 2023 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణకు (Ukraine Crisis) సంబంధించి కొన్ని రహస్య పత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెలుగు చూశాయి. మ్యాప్‌లు, చార్ట్‌లు, కొన్ని ఫొటోలపై అత్యంత రహస్యం (Top Secret) అని ఉండటం సంచలనం సృష్టించింది. అయితే, ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా (Pentagon) రూపొందించిన పత్రాలే లీకైనట్లు తేలింది. అందులో ఏయే విషయాలు ఉన్నాయని పరిశీలిస్తే..

ఉక్రెయిన్‌లో కీలక యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ రూపొందించినట్లు సమాచారం. వీటిలో ఉక్రెయిన్‌, రష్యాకు చెందిన సైనికుల మరణాల సంఖ్య, ఆయా సైన్యాలకున్న ముప్పు, ఉక్రెయిన్‌ ప్రతిదాడులకు దిగాలని భావిస్తే వాటికున్న సామర్థ్యాలకు చెందిన డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా అందించిన ఆయుధాలు, శిక్షణ సహాయం, సైనిక వ్యూహాల వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయట.

ఉక్రెయిన్‌ ప్రస్తుతం ఎస్‌-300, బల్క్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందకుంటే మే, ఏప్రిల్‌ నాటికి అవి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పత్రాలను బట్టి తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ సైన్యానికి వాయుసేన రక్షణ కవచంగా నిలుస్తోందని అందులో పేర్కొంది. కేవలం రష్యా, ఉక్రెయిన్‌ల సమాచారమే కాకుండా ఇజ్రాయెల్‌, దక్షిణకొరియాకు చెందిన సమాచారమూ ఉందట. అయితే, ఇంటర్నెట్‌లో లీకైన ఈ డాక్యుమెంట్లు వాస్తవమైనవేనని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఈ విషయాలపై నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

ఎవరు..? ఎందుకు..?

ఈ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్‌ చేశారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ, మార్చి తొలివారంలోనే అవి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా వీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కీలక సమయంలో అత్యంత సున్నితమైన వివరాలు బయటకు పొక్కడంపై కలవరం చెందుతోంది. ఇలా ఈ వ్యవహారంపై కీవ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కీలక డేటా లీకయ్యిందంటూ వార్తలు రావడం వ్యూహంలో భాగమేనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటి వెనక రష్యా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తుంటే.. క్రెమ్లిన్‌ మాత్రం వాటిని కొట్టిపారేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని