Earthquake: ఎటుచూసినా శవాల గుట్టలే.. భూకంప మృతులు 11వేలకు పైనే!

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం (Earthquake) సృష్టించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య 11వేలు దాటేసింది. ఏ భవనశిథిలాల కింద చూసినా సరే ప్రాణం లేని దేహాలే కన్పిస్తున్నటువంటి దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి.

Updated : 08 Feb 2023 17:04 IST

అంకారా: తుర్కియే (Turkey), సిరియా (Syria)ల్లో భారీ భూకంపం సృష్టించిన విలయంతో  అక్కడ హృదయవిదారక దృశ్యాలు కొనసాగుతున్నాయి. వేలాదిగా భవనాలు కుప్పకూలి సమాధులను తలపిస్తుండటంతో ఆ శిథిలాల నుంచి మృతదేహాల్ని వెలికి తీసేందుకు సహాయక బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 11వేల మందికి పైగా మృత్యువాతపడినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, గత దశాబ్ద కాలంలో సంభవించిన భూప్రళయాల్లో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఒక్క తుర్కియేలోనే 8,754మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటించగా.. సిరియాలో మొత్తంగా 2470 మంది ఈ ప్రకృతి ప్రకోపానికి బలైపోయారు. మొత్తంగా ఇప్పటివరకు 11,224 మంది మృతిచెందారు. మరోవైపు, గాయపడిన వారి సంఖ్య వేల సంఖ్యల్లోనే ఉంది. వేలాదిగా కుప్పకూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా దాని కింద ప్రాణంలేని దేహాలే కనబడుతున్న దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. మరోవైపు, శిథిలాల కింద ఊపిరాడక ప్రాణం కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాల శిథిలాల కింద కుటుంబాలకు కుటుంబాలే విగత జీవులై పడి ఉన్న దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.

ఈ ఘోర విపత్తుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మరింత సహాయం అందించాలంటూ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ అధికారులను ఆదేశించారు. భూకంపంతో భారీగా ప్రభావితమైన ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. ఇంకోవైపు, భూకంప ప్రభావిత జోన్‌లో ప్రస్తుతం దాదాపు 60,000 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. ఈ వినాశనం తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికీ అనేక మంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్న అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20కి పైగా దేశాల నుంచి వెళ్లిన సహాయక  బృందాలు తుర్కిష్‌ అత్యవసర బృందాలతో కలిసి సహాయక చర్యల్ని  కొనసాగిస్తున్నాయి.  ఇంకోవైపు, ఈ భూవిలయంలో మృతుల సంఖ్య 20వేలు దాటే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిన్న అంచనా వేసిన విషయం తెలిసిందే.

ఈ భూకంపం తీవ్రతకు తుర్కియేలోని మొత్తం 85 మిలియన్ల జనాభాలో 13 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వెల్లడించారు. ఈ భూ విలయం తీవ్రత అధికంగా ఉన్న 10 ప్రావిన్స్‌ల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 8వేల మందికి పైగా పౌరుల్ని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చినట్టు ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి 3.8లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలు/వసతి గృహాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని