Russia: మాస్కో మిలిటరీ ఆయుధగారానికి సమీపంలో డ్రోన్లు.. కూల్చేసిన రష్యా

Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అవి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. 

Published : 21 Jun 2023 13:50 IST

(ప్రతీకాత్మక చిత్రం)

మాస్కో: గత ఏడాది ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) సైనిక చర్య తర్వాత రెండు దేశాల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రష్యా రాజధాని నగరం మాస్కో(Moscow)కు సమీపంలోని మిలిటరీ ఆయుధగారంపై డ్రోన్‌ దాడికి విఫల యత్నం జరిగింది. డ్రోన్లను ముందుగానే గుర్తించడంతో వాటిని కూల్చివేసినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

‘మిలిటరీ బేస్‌కు చెందిన గోదాముల వైపు దూసుకువచ్చిన రెండు డ్రోన్లను బుధవారం తెల్లవారుజామున కూల్చివేశాం’ అని మాస్కో రీజియన్ గవర్నర్ ఆండ్రీ వొరొబియోవ్ వెల్లడించారు. మాస్కోకు 50 కి.మీ దూరంలో ఉన్న నరో ఫొమిన్స్క్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇదివరకు అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌పై డ్రోన్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిని ముందుగానే గుర్తించి, కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది. దాడి సమయంలో క్రెమ్లిన్‌లో పుతిన్‌ లేరని పేర్కొంది. అయితే ఆ దాడితో తమకు ఏం సంబంధం లేదని ఆ రోజున ఉక్రెయిన్ వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. సైనిక చర్యలో భాగంగా రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ దాడులు నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా ప్రాంతాలపై ఇటీవల కాలంలో భారీగా డ్రోన్ల దాడులు పెరిగాయి. రష్యా దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటోన్న ఉక్రెయిన్‌ వైమానిక సిబ్బందిని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశంసించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని