Gold Heist: భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు

కెనడా (Canada) ఎయిర్‌పోర్టులో మాయమైన బంగారం కంటెయినర్ కేసులో ముందడుగు పడింది. ఆ కేసులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Published : 18 Apr 2024 19:01 IST

ఒట్టావా: 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కార్గో కంటెయినర్‌ (cargo container)ను గత ఏడాది టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొందరు దుండగులు చోరీ చేసిన సంగతి తెలిసిందే. కెనడా చరిత్రలోనే ఈ అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మరో ముగ్గురికి వారెంట్లు జారీ చేశారు. (gold-cash heist)

గత ఏడాది ఏప్రిల్ 17న స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన విమానం టొరంటో ఎయిర్‌పోర్టులో దిగింది. దానిలో 20 మిలియన్‌ కెడియన్ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విలువైన విదేశీ నగదు ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో అదృశ్యమైంది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించింది. బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దోపిడీ సమయంలో వీరిలో ఒకరు ఆ దేశ విమానయాన సంస్థ ఎయిర్‌ కెనడాలో పని చేస్తున్నారు. అలాగే ఆ సంస్థకు చెందిన కొందరు సిబ్బంది సహకరించినట్లు తెలిపారు. 

కెనడా ఎయిర్‌పోర్టులో ఇంత భారీ చోరీ జరగడం ఇదే తొలిసారి కాదు. 1952లో టొరంటో ఎయిర్‌పోర్టులో అప్పట్లోనే 2.15 లక్షల డాలర్లు విలువైన బంగారం అపహరణకు గురైంది. ప్రస్తుతం దాని విలువ సుమారు 23 లక్షల డాలర్లకు సమానం. ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అలాగే 1974లో అట్టావా విమానాశ్రయంలో సురక్షిత ప్రదేశంలో ఉంచిన బంగారాన్ని ఒక గార్డు తుపాకీతో బెదిరించి దొంగిలించాడు. దాని విలువ నేడు 4.6 మిలియన్‌ కెనడియన్‌ డాలర్లకు సమానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని