UAE Blue Visa: యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?

UAE Blue Residenency Visa: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..?

Published : 17 May 2024 13:34 IST

UAE Blue Residenency Visa | దుబాయ్‌: పర్యావరణ పరిరక్షణ ( Environment Protection), సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా (Blue Residenency Visa)’ల జారీకి ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వెల్లడించారు. తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం అనేది పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

ఏంటీ వీసా..?

పదేళ్ల పాటు యూఏఈలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక ‘బ్లూ వీసా (Blue Visa)’లను ఇవ్వనున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు. మెరైన్‌ లైఫ్‌, భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత, సుస్థిర సాంకేతికత తదితర రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ వీసాలకు అర్హులు. వీటి కోసం ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ, సిటిజన్‌సిప్‌, కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్‌ఫ్రమ్‌ హోం

ఈ వీసా (Visa)లు పొందే వ్యక్తులకు యూఏఈలో దీర్ఘకాలిక నివాసంతో పాటు పర్యావరణ ప్రాజెక్టుల్లో సహకారం అందించే అవకాశాలు లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేపట్టే చర్యలకు నిధులు, వనరులను కూడా ప్రభుత్వం నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

కాగా.. యూఏఈ ఇప్పటికే ‘గోల్డెన్‌ వీసా’లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇప్పటికే మన దేశానికి చెందిన పలువురు సినీ ప్రముఖులకు ఈ వీసాలు లభించాయి. దీంతో పాటు గ్రీన్‌ వీసా, రిమోట్‌ వర్కింగ్ వీసాలను ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని