Ukraine: వ్యూహాలు మార్చుతూ.. విరుచుకుపడుతోన్న ఉక్రెయిన్..!

రష్యా చేస్తున్న భీకర దాడులను (Russia Invasion) ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థల సహాయంతో సరికొత్త వ్యూహాలతో రష్యాపై ఎదురుదాడికి (Counter-offensive) దిగుతోంది. 

Published : 19 May 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదిహేను నెలలుగా రష్యా చేస్తున్న దురాక్రమణను (Russia Invasion) ఉక్రెయిన్‌ దీటుగా ఎదుర్కొంటోంది. ఇటీవల కొంతకాలం ఈ దాడుల తీవ్రత తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కొన్ని వారాలుగా భారీ క్షిపణులతో రష్యా దూకుడు పెంచింది. దీంతో పాశ్చాత్య దేశాలు అందిస్తోన్న ఆయుధ సహాయంతో ఉక్రెయిన్‌ (Ukraine) కూడా సరికొత్త వ్యూహాలతో ప్రతిదాడులకు (Counter-offensive) దిగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో క్షిపణులతో రష్యా తెగబడుతున్నప్పటికీ.. ఉక్రెయిన్‌ మాత్రం ప్రతిదాడులతో వాటిని సమర్థంగా నిలువరిస్తోంది.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లక్ష్యంగా చేసుకొని క్షిపణి, డ్రోన్ల దాడులకు రష్యా (Russia) పాల్పడుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు తొమ్మిదిసార్లు క్షిపణి దాడులకు (Missile Attacks) తెగబడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ కీవ్‌లో మాత్రం భారీ నష్టం సంభవించలేదు. నగరంపైకి దూసుకువచ్చే రాకెట్లను ఉక్రెయిన్‌ రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు కూల్చివేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 30క్షిపణులు దాడి చేయగా అందులో 29 క్షిపణులను నిరోధించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌ సైన్యం ప్రతిదాడులతో పలు ప్రాంతాలు భారీ శబ్దాలతో మార్మోగిపోతున్నాయి. రష్యా సేనలు ఆక్రమించుకున్న బఖ్ముత్‌లోనూ తమ సైన్యం దూసుకెళ్తోందని ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొంది. ఇందుకు నాటో సమకూర్చిన గగనతల నిరోధక వ్యవస్థలే రక్షణ కవచంగా మారినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

పేట్రియాట్‌తో రక్షణ..

రష్యా దాడులను అడ్డుకునేందుకు అమెరికా అందించిన పేట్రియాట్‌ గగనతర రక్షణ వ్యవస్థ కూడా ఎంతగానో దోహదం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ దగ్గర ఇటువంటి అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి అమెరికా అందించగా.. మరొకటి మాత్రం జర్మనీ, నెదర్లాండ్‌లు కలిసి సమకూర్చాయి. అయితే, వీటిని లక్ష్యంగా చేసుకొని ఇటీవల రష్యా ప్రయోగించిన ఆరు హైపర్‌సోనిక్‌ క్షిపణిలను ఈ పేట్రియాట్‌ వ్యవస్థలు విజయవంతంగా నిరోధించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రత్యర్థులు చేసే క్షిపణి దాడులను ముందుగానే పసిగట్టి విరుచుకుపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యవస్థ స్వల్పంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థలను తికమకపెట్టే విధంగా రష్యా సైన్యం కూడా భారీ మొత్తంలో ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒకేసారి అనేక దిశల్లో గగనతల దాడులను చేయడం ఇందులో భాగం. అయితే, ఇదే వ్యూహాన్ని ఉక్రెయిన్‌ అవకాశంగా మలచుకుంటున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. భారీ స్థాయిలో దాడులకు పాల్పడటం వల్ల రష్యా ఆయుధ నిల్వలు త్వరగా తరిగిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలను అందించడమే కాకుండా సైనికులకు శిక్షణ ఇస్తుండటంతో రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని