Russia - Ukraine: మరో రష్యా నౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌.. రెండు నెలల వ్యవధిలో ఇది మూడోది

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మాస్కోకు కీవ్‌ వరుస షాకులిస్తోంది. రెండు నెలల వ్యవధిలో మూడు రష్యా నౌకలను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది.

Published : 05 Mar 2024 19:32 IST

కీవ్‌: రష్యా (Russia)కు చెందిన కొత్త పెట్రోలింగ్ నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ (Ukraine) రక్షణశాఖ మంగళవారం ప్రకటించింది. నల్ల సముద్రంలో ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘రష్యాకు చెందిన సెర్గీ కొత్వోవ్‌ అనే నౌక నల్ల సముద్రంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుంటుంది. ఇటీవలే దీన్ని సబ్‌మెరైన్‌ స్థాయికి ఆధునీకరించారు. దీని విలువ 65 మిలియన్‌ డాలర్లు. ఉక్రెయిన్‌ రక్షణ విభాగానికి చెందిన గ్రూప్‌ 13 బృందం ‘మాగురా-వీ5 శ్రేణి సముద్ర డ్రోన్లతో’ దానిపై దాడి చేశాయి. ఈ దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతింది’’ అని ట్వీట్‌లో పేర్కొంది. 

నల్ల సముద్రంలో రష్యా నౌకల గస్తీని ఏమాత్రం సహించేది లేదు ఉక్రెయిన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ ఆండ్రీ యెర్మాక్‌ తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో క్రిమియా నుంచి రష్యాను కలిపే రైలు మార్గంలోని వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మాస్కో ప్రతినిధి వెల్లడించారు. గత నెలలో రష్యాకు చెందిన భారీ ల్యాండింగ్‌ నౌక ‘సీజర్‌ కునికోవ్‌’ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అంతకుముందు ఒక మిసైల్‌ బోటును కూడా నాశనం చేసినట్లు వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి నెలలోనే రష్యాకు చెందిన రెండు నౌకలను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ముఖ్య నౌకలపై నల్ల సముద్రంలో ఉక్రెయిన్ వరుస దాడులు చేస్తోంది. రెండు నెలల వ్యవధిలో ఇది మూడో దాడి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని