Ukraine: సైన్యంలోకి యువ రక్తం!.. నిర్బంధ వయసు 25కు తగ్గించిన ఉక్రెయిన్‌

రష్యా దురాక్రమణతో (Russian invasion) కుదేలవుతోన్న ఉక్రెయిన్‌.. సైనిక శక్తిని భర్తీ చేసుకునేందుకు నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది.

Updated : 03 Apr 2024 17:33 IST

కీవ్‌: రష్యా దురాక్రమణతో (Russian invasion) కుదేలవుతోన్న ఉక్రెయిన్‌.. రెండేళ్లకు పైగా పుతిన్‌ సేనలతో పోరాడుతూనే ఉంది. దీంతో సైనిక, ఆర్థిక నష్టాలను తీవ్ర స్థాయిలో చవిచూసింది. ఈ క్రమంలో కోల్పోయిన సైనిక శక్తిని భర్తీ చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సైనిక నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని అక్కడి (Ukraine Crisis) పార్లమెంటు గత ఏడాదే ఆమోదించినప్పటికీ.. తాజాగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) సంతకం చేయడంతో అమల్లోకి వచ్చింది.

5 లక్షల మందిని తీసుకోవాలని..

ఉక్రెయిన్‌ 5 లక్షల మంది సైనికులను సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ స్థాయిలో సమీకరణ చేయడం.. 13.4 బిలియన్‌ డాలర్ల విలువతో సమానమన్నారు. ఇన్నాళ్లుగా యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న సైనికులను మార్చడం, లేదా ఇంటికి పంపించడం వంటి సున్నిత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సైనికాధికారులకు సూచించారు. ఈ సైనిక సమీకరణ అంశంపై గతేడాది అక్కడి పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే, దీనికి ఆమోదం తెలిపేందుకు జెలెన్‌స్కీ ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా తాజా నిర్ణయం ద్వారా కొత్తగా ఎంతమంది ఉక్రెయిన్‌ సైన్యంలోకి వస్తారనే విషయంపై సైనికాధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు.

10లక్షల సైన్యం..

ఉక్రెయిన్‌ రక్షణశాఖ గణాంకాల ప్రకారం.. గత అక్టోబర్‌ నాటికి అక్కడి సైనిక బలం 8 లక్షలు. నేషనల్‌ గార్డ్‌తోపాటు ఇతర యూనిట్లు కలిపి మొత్తంగా అక్కడి భద్రతా దళాల్లో 10లక్షల మంది సైనికులు ఉన్నట్లు అంచనా. రష్యా మాదిరిగానే ఉక్రెయిన్‌ సైనికుల సరాసరి వయసు 40ఏళ్లుగా ఉన్నట్లు అక్కడి రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, యువకులను సైన్యంలోకి తీసుకుంటే అక్కడి మానవ వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన ఉక్రెయిన్‌ వాసుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, దాదాపు రెండున్నరేళ్లుగా రష్యాతో పోరాడుతోన్న ఉక్రెయిన్‌.. మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో నిర్బంధ సైన్యం అక్కడ సున్నిత విషయంగా మారింది. అటువైపు ఇదే సమస్యను ఎదుర్కొంటున్న రష్యా.. కొన్నాళ్లక్రితం సైనిక సమీకరణను చేపట్టింది. దాదాపు 3 లక్షల మందిని నియమించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టగా.. దానిపై రష్యాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని